హైదరాబాద్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): వైద్య విద్యలో పీజీ ఇన్‌సర్వీస్ కోటా అమలుచేయాలని సూచిస్తూ ప్రత్యేక కమిటీ ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. క్లినికల్ విభాగంలో 20 శాతం, నాన్ క్లినికల్ విభాగంలో 40 శాతం పీజీ వైద్య విద్యసీట్లను ఈ కోటా కింద కేటాయించాలని పేర్కొన్నది. దీనిపై త్వరలో ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. పీజీ ఇన్‌సర్వీస్ కోటా అంశం పరిష్కారానికి ప్రభుత్వం గతనెల 18న డీఎంఈ రమేశ్‌రెడ్డి కన్వీనర్‌గా, డీహెచ్ శ్రీనివాసరావు, కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ కరుణాకర్‌రెడ్డి, నిమ్స్ డైరెక్టర్ మనోహర్‌తో కమిటీ ఏర్పాటుచేసింది. పూర్తి అధ్యయనం చేసిన తర్వాత ఈ కమిటీ ఇన్‌సర్వీస్ కోటా అమలుచేయాలని సూచించింది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే 300 మంది ప్రభుత్వ ఎంబీబీఎస్ వైద్యులకు పీజీ కోర్సులుచేసే వెసులుబాటు కలగనున్నది. తద్వారా ఏటా సర్కారు దవాఖానల్లో కొత్తగా 300 మంది స్పెషలిస్టు వైద్యులు అందుబాటులోకి వస్తారు.
928 ఇన్‌సర్వీస్ కోటా సీట్లు
రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు కలిపి మొత్తం 2,017 పీజీ సీట్లు ఉన్నాయి. ఇందులో 928 సీట్లు ఇన్‌సర్వీస్ కోటా పరిధిలోకి వస్తాయి. నిబంధనల ప్రకారం, క్లినికల్‌లో 20 శాతం సీట్లు, నాన్ క్లినికల్‌లో 40 శాతం సీట్లు ఇన్ సర్వీస్ కోటా కింద కేటాయించనున్నారు. గిరిజన ప్రాంతాల్లో రెండేండ్లపాటు పనిచేసినవారు, గ్రామీణ ప్రాంతాల్లో మూడేండ్లు, పట్టణ ప్రాంతాల్లో ఆరేండ్లపాటు పని చేసినవారు దీనికి అర్హులు. నీట్ పీజీ అర్హత పరీక్షలో 50 శాతం మార్కులతో పాసైతే ఇన్ సర్వీస్ కోటాలో పీజీ చేయొచ్చు. నీట్లో ర్యాంకు సాధించడం కష్టంకావడంతో చాలామంది ఇన్‌సర్వీస్ కోటాలో పీజీ చేసేందుకు ఆసక్తి చూపుతారు.