బుధవారం 02 డిసెంబర్ 2020
Telangana - Nov 11, 2020 , 01:33:24

ఫైజర్‌ టీకా భారత్‌కు ఎప్పుడు?

ఫైజర్‌ టీకా భారత్‌కు ఎప్పుడు?

న్యూఢిల్లీ, నవంబర్‌ 10: కరోనా వైరస్‌ను తమ టీకా సమర్థంగా అడ్డుకుంటున్నట్టు ఫైజర్‌, బయోఎన్‌టెక్‌ సంస్థలు ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి ఆ టీకాపై పడింది. మరి ఆ వ్యాక్సిన్‌ భారత్‌లో అందుబాటులోకి వస్తుందా అంటే.. ప్రస్తుతానికి లేదనే చెప్పవచ్చు. వందల కోట్ల వ్యాక్సిన్‌ డోసుల పంపిణీ కోసం ఆ సంస్థలు ఇదివరకే అమెరికా, బ్రిటన్‌, జపాన్‌, యూరోపియన్‌ యూనియన్‌ దేశాలతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ప్రస్తుత అంచనాల ప్రకారం ఫైజర్‌ ఈ ఏడాదిలోగా 5 కోట్ల డోసులు, వచ్చే ఏడాదిలో 130 కోట్ల డోసుల వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేయనుంది. ఆగస్టులో ఈ వ్యాక్సిన్‌ ప్రాథమిక ఫలితాలు వెలువడినప్పుడు భారత ప్రభుత్వం ఆ సంస్థ ప్రతినిధులతో సమావేశమైనప్పటికీ, ఆ తర్వాత ఆ విషయంలో ఎలాంటి పురోగతి లేదు. భారత్‌లో టీకాను విడుదల చేయాలంటే ముందుగా ఇక్కడ ఆ టీకాపై ట్రయల్స్‌ నిర్వహించాల్సి ఉంటుంది. ప్రస్తుతం భారత్‌ బయోటెక్‌, సీరమ్‌, జైడస్‌ కాడిలా, రెడ్డీస్‌ ల్యాబ్స్‌, బయలాజికల్‌ ఈ సంస్థలు ట్రయల్స్‌ నిర్వహిస్తున్న టీకాలపైనే భారత్‌ దృష్టిపెట్టింది.