Singareni | మంచిర్యాల, ఆగస్టు 12(నమస్తే తెలంగాణ ప్రతినిధి): సింగరేణి సంస్థలో జరిగిన పీఎఫ్ కుంభకోణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సంస్థ ఇచ్చిన కాంట్రాక్ట్(వర్క్ ఆర్డర్)ను పట్టించుకోకుండా ప్రసాద్ సుశీ హైటెక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కార్మికుల ప్రావిడెంట్ ఫండ్‌ను కొట్టేసింది. నిబంధనల ప్రకారం కాంట్రాక్ట్ కార్మికుడికి కూడా సీఎంపీఎఫ్ (కోల్‌మైన్స్ ప్రావిడెంట్‌ఫండ్) చెల్లించాలి. కార్మికుడి వేతనంలోని 19 శాతాన్ని కంపెనీ జమస్తే, మరో 19 శాతాన్ని కార్మికుడి వేతనం నుంచి కట్ చేసి ఈపీఎఫ్గా చెల్లించాలి. సుశీ కంపెనీ మాత్రం మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఓసీపీ (ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు)లో తమ వద్ద పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల్లో గరిష్టంగా 40 శాతం మందికి మాత్రమే పీఎఫ్ చెల్లించి మిగతా వారికి రూపాయి కూడా చెల్లించలేదు. ఈ రకంగా 11కోట్లపైనే కంపెనీ నొక్కేసినట్టు ప్రాథమికంగా తేలింది. ఇదే కంపెనీ ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సత్తుపల్లిలోని జేవీఆర్ ఓసీపీలోనూ కాంట్రాక్ట్ సంస్థగా ఉంది. శ్రీరాంపూర్ తరహాలోనే పీఎఫ్ అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలున్నాయి.
సింగరేణి సంస్థ 2016 జూన్‌లో శ్రీరాంపూర్ ఓసీపీలో మట్టి తవ్వకాల పనులకు ప్రసాద్ సుశీ హైటెక్ కంపెనీకి 72 నెలల కాలానికి వర్క్ ఆర్డర్ ఇచ్చింది. ఆ తర్వాత మరో ఏడాది పొడిగించింది. మొత్తంగా 84 నెలలు శ్రీరాంపూర్ ఓసీపీలో మట్టి తవ్వకాలు జరిపింది. ఇందుకోసం దాదాపు 1000 మంది కార్మికులను తీసుకుంది. అయితే, డిసెంబర్ 2021లో డైరెక్టర్ జనరల్ మైన్స్ సేఫ్టీ (డీజీఎంఎస్)కు ఇచ్చిన వార్షిక నివేదికలో 924 మంది కార్మికులు తమ సంస్థలో పనిచేస్తున్నట్టు పేర్కొన్నది. ఆ ఏడాది మొత్తంలో ఒక నెలలో 490 మందికి మాత్రమే పీఎఫ్ జమచేసింది. కొన్ని నెలల్లో మాత్రం ఒకరిద్దరికి జమచేసింది.
శ్రీరాంపూర్ ఓసీపీలో కార్మికులకు జరుగుతున్న అన్యాయంపై సామాజిక కార్యకర్త నహీం పాషా ప్రధానమంత్రి కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. కంపెనీలో 900 మంది పని చేస్తుంటే తక్కువ మందికి పీఎఫ్ కడుతున్నారంటూ లెక్కలతో బయటపెట్టారు. పీఎంవో నుంచి ఆ ఫిర్యాదు ఫిర్యాదు పశ్చిమబెంగాల్ ధన్బాగ్లోని సీఎంపీఎఫ్ ప్రధాన కార్యాలయానికి ఫార్వర్డ్ చేశారు. అక్కడి నుంచి గోదావరిఖని రీజినల్ ఆఫీస్‌కు పంపించారు. ఇక్కడున్న సీఎంఫీఎఫ్ రీజినల్ కమిషనర్ ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్తో గోదావరిఖని రీజియన్ పరిధిలోకి వచ్చే (మందమర్రి, బెల్లంపల్లి, శ్రీరాంపూర్, ఆర్టీ-1, ఆర్జీ-2, ఆర్టీ-3, భూపాలపల్లి) అన్ని ఓసీపీల్లో వెరిఫికేషన్ చేయించారు. ఈ క్రమంలో సుశీ కంపెనీ శ్రీరాంపూర్ ఓసీపీలో కార్మికులకు చేస్తున్న మోసాన్ని గుర్తించారు. డీజీఎంఎస్కు ఇచ్చిన వార్షిక నివేదికలో 924 మంది పని చేస్తున్నారని చెప్పిన సుశీ కంపెనీ విచారణకు వచ్చిన అధికారిని తప్పుదోవ పట్టించినట్టు తెలిసింది. అయినా ఎంక్వైరీలో శ్రీరాంపూర్ ఓసీపీలో 715 మంది పని చేస్తుంటే, 280 మందికే పీఎఫ్ జమచేస్తున్నారని, మిగిలిన వారికి పీఎఫ్ ఇవ్వడం లేదని తేలింది. నిబంధనల ప్రకారం అందరికీ పీఎఫ్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని సింగరేణి డైరెక్టర్ పాకు సీఎంపీఎఫ్ కమిషనర్ లెటర్ రాశారు. 2021 జనవరిలో ఈ లెటర్ రాస్తే సింగరేణి సంస్థ ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
సింగరేణిలో 2016 లో సుశీ కంపెనీ కాంట్రాక్ట్ తీసుకునే నాటికి ప్రతి ఒక్క కార్మికుడికి జీతం రూ.15 వేలుగా ఉంది. నిబంధనల ప్రకారం ఒక్కో కార్మికుడికి నెలకు రూ. 2,850 సీఎంపీఎఫ్ జమకావాలి. కంపెనీ మాత్రం తమ వద్ద పనిచేస్తున్న 924 మందిలో 400 మందికి మాత్రమే పీఎఫ్ చెల్లించి మిగతా వారికి అసలు చెల్లించనే లేదని తేలింది. చెల్లించని మొత్తం నెలకు రూ. 14,25,000 అవుతుంది. ఈ లెక్కన 80 నెలల కాలానికి అది రూ. 11.4 కోట్లు అవుతుంది. ఇదే కంపెనీ కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఆధ్వర్యంలో ఉన్న జీవీఆర్ ఓసీపీలో 2018 నుంచి 770 మంది పనిచేస్తున్నారు. కంపెనీ మాత్రం 440 మందికే పీఎఫ్ చెల్లిస్తున్నట్టు తెలిసింది. ఇక్కడ కూడా దాదాపు రూ. 5 కోట్ల మేర పీఎఫ్ ఎగ్గొట్టినట్టు తేలింది. ఈ మొత్తం సుశీ కంపెనీ ఖాతాల్లోకి వెళ్లినట్టు సమాచారం.
ఓసీపీలకు సంబంధించి ప్రైవేటు సంస్థలకు కాంట్రాక్ట్ అప్పగించేప్పుడు కార్మికుల జీతాలు, సంక్షేమ చర్యలు, సీఎంఫీఎఫ్, బోనస్, వాడే మిషనరీ, వాహనాలు ఇలా అన్నింటినీ పరిగణలోకి తీసుకుని సింగరేణి ఒక ఫార్ములా కోట్ చేస్తుంది. దానినే ప్రైజ్ వ్యాల్యుయేషన్ ఫార్ములా అంటారు. ఆ ఫార్ములా ప్రకారం ఒక ఎస్టిమేషన్ సిద్ధం చేసి సింగరేణి కంపెనీ బిడ్డింగ్‌లను ఆహ్వానిస్తున్నది. అయితే, కంపెనీ బిడ్డింగ్ పిలిచిన మొత్తానికంటే తక్కువ మొత్తానికి కోట్ చేసిన సంస్థలు కాంట్రాక్ట్ దక్కించుకోవడం గమనార్హం. ఉదాహరణకు.. ఓసీపీలో ఒక క్యూబిక్ మీటర్ మట్టి తవ్వడానికి రూ.100 ఖర్చు అవుతుందని కంపెనీ నిర్ణయిస్తే, కాంట్రాక్టర్లు మాత్రం రూ.50, రూ.40లకే చేస్తామని లెస్‌కి టెండర్లు వేసి దక్కించుకుంటారు. తక్కువకే కోట్ చేసిన వారికి సింగరేణి కాంట్రాక్ట్ బాధ్యతలు అప్పగిస్తుంది. పనులు మొదలయ్యాక కాంట్రాక్ట్ కంపెనీలు మెలిక పెడతాయి. నష్టం వస్తున్నదని చెప్పి కార్మికులకు చెల్లించాల్సిన పీఎఫ్‌ను ఎగ్గొట్టి ఆ మొత్తాన్ని మిగుల్చుకుంటున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సింగరేణి సంస్థకున్న 17 ఓసీపీల్లోనూ ఇదే జరుగుతున్నట్టు తెలిసింది. ఒక్క శ్రీరాంపూర్ ఓసీపీ, సత్తుపల్లి ఓసీపీలో ఒకే ఒక్క కంపెనీ చేసిన మోసమే రూ.15 కోట్లు ఉంటే.. 20 ఏళ్లకు పైగా సింగరేణిలో ఓసీపీలు నడుస్తున్నాయి. అప్పటి నుంచి లెక్కలు వేస్తే వేల కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగి ఉంటాయని అనుమానిస్తున్నారు.
సుశీ కంపెనీకి సంబంధించిన సమాచారం కోసం అధికారులను సంప్రదిస్తే దాటవేసే ప్రయత్నం చేస్తున్నారు. వారి అధికార ప్రతినిధిని అడగాలని సలహా ఇస్తున్నారు. వారి సూచన మేరకు శ్రీరాంపూర్ ఏరియా ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో అడిగితే పాత సమాచారంతో మీరేం చేస్తారని ప్రశ్నిస్తున్నారు. తాము సమాచారం ఇవ్వలేమని, కావాలంటే ఆర్టీఐ కింద దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు. ఇదే విషయంపై శ్రీరాంపూర్ ఏరియా జీఎంను వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు.
కాంట్రాక్ట్ కార్మికులకు పీఎఫ్ జమ చేయడంలో జరుగుతున్న అన్యాయంపై నాలుగేండ్లుగా పోరాడుతున్నా. సీఎంఫీఎప్, ఈపీఎఫ్ కమిషనర్లకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. సింగరేణి సంస్థ ఇచ్చిన వర్క్ ఆర్డర్ నిబంధనలు ఉల్లంఘించిన కాంట్రాక్టర్ సుశీ హైటెక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి. కార్మికులకు న్యాయంగా రావాల్సిన ఈపీఎఫ్ డబ్బులు మిగుల్చుకోవడం హేయమైన చర్య. సదరు కంపెనీపై నిబంధనల ప్రకారం క్రిమినల్ కేసు నమోదు చేసి కార్మికుల సొమ్ము మొత్తాన్ని రికవరీ చేయాలి. ఇందుకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించిన సింగరేణి అధికారులపై చర్యలు తీసుకోవాలి.