ఉద్యోగమేమో హైస్కూల్లో భాషాపండితుడు. 6-10 తరగతులకు బోధన. హోదా మాత్రం.. సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ). వేతనంలోనూ వ్యత్యాసమే. ఉన్నత తరగతులకు చెప్పినందుకు రోజుకు ఇచ్చే భత్యం.. రూ.5 మాత్రమే. అదీ డీఈవో అనుమతిస్తేనే. సెలవుల్లో అదీ రాదు. 20-25 ఏండ్లుగా ఉన్నత తరగతులకు పాఠాలు చెప్తున్నా ఎస్సెస్సీ స్పాట్ వాల్యుయేషన్‌కు అనర్హులు. సమాన పనికి సమాన వేతనం అన్న రాజ్యాంగ సూత్రం వీరికి వర్తించదు. పైగా, 2001 తర్వాత హైస్కూల్లో స్కూల్ అసిస్టెంట్లు మాత్రమే బోధించాలన్న నిబంధన అమలు కాలేదు. దీంతో.. భాషాపండితులు ఎంతో వేదనను అనుభవించారు. కేసీఆర్ సర్కారు హయాంలో తీసుకొన్న నిర్ణయంతో ఆ అన్యాయానికి సోమవారం శుభంకార్డు పడింది.
హైదరాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ): దశాబ్దాలుగా అన్యాయానికి గురైన భాషాపండితులు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి పొందారు. టీచర్ల బదిలీలు, పదోన్నతుల్లో భాగంగా సోమవారం ఈ కీలక పరిణామం చోటుచేసుకున్నది. మల్టీజోన్-1లో 5,306 మంది భాషాపండితులు, 1,057 మంది పీఈటీలు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి పొందారు. టీచర్ల నుంచి ఆప్షన్లు స్వీకరించిన ప్రభుత్వం ఆయా ఆప్షన్ల ప్రకారం పదోన్నతులు ఇచ్చి పోస్టింగ్స్‌ను జారీచేసింది. వీరంతా మంగళవారం పదోన్నతి పొందిన చోట విధుల్లో చేరుతారు. తాజా పదోన్నతులతో రాష్ట్రంలో గ్రేడ్-2 భాషాపండిత వ్యవస్థే రద్దయింది. ఇక నుంచి స్కూల్ అసిస్టెంట్ (లాంగ్వేజ్)గా మాత్రమే ఆయా టీచర్లను వ్యవహరిస్తారు. ఈ నెల 22న మల్టీజోన్-2లోని వారికి పదోన్నతులు దక్కనున్నాయి. ప్రపంచ తెలుగు మహాసభల్లో ఇచ్చిన హామీకి కట్టుబడి అప్పటి కేసీఆర్ సర్కారు పండితులు, పీఈటీ అప్‌గ్రేడేషన్ చేపట్టింది. సర్వీస్ రూల్స్ 11, 12ను సవరించి పండితుల కోసం జీవో 2, 3.. పీఈటీల కోసం జీవో 9, 10 జారీచేసింది. జీవో-110 ద్వారా 10,479 పోస్టులను అప్‌గ్రేడ్ చేసింది.
ఉపాధ్యాయ సంఘాల హర్షం
పండిత్, పీఈటీ అప్‌గ్రేడెషన్ పట్ల పలు ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తంచేశాయి. ఇందుకు సహకరించిన ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలిపాయి. పదోన్నతి పొందిన వారికి రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు తెలంగాణ (ఆర్‌యూపీపీటీ) రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మహ్మద్ అబ్దుల్లా, గుళ్లపల్లి తిరుమలకాంతి కృష్ణ శుభాకాంక్షలు తెలిపారు. భాషాపండితుల జీవితాల్లో ఇదో సువర్ణ అధ్యాయమని అభివర్ణించారు. పదోన్నతుల్లో 8,630 మంది తెలుగు, హిందీ, ఉర్దూ, మరాఠీ, సంస్కృతం, కన్నడ భాషాపండితులు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి పొందనున్నారని ఆర్‌యూపీపీ తెలంగాణ స్టేట్ అధ్యక్ష ప్రధానకార్యదర్శులు జగదీశ్, నర్సింహులు వెల్లడించారు. మరింత భాషాబోధన చేసి విద్యార్థులను ఉత్తమంగా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. అప్‌గ్రేడేషన్ ద్వారా భాషాపండితుల చిరకాల కల సాకారమైందని ఆత్మగౌరవాన్ని నిలబెట్టినవారందరికీ రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ (ఎస్‌ఎల్‌టీఏ) రాష్ట్ర అధ్యక్ష ప్రధానకార్యదర్శులు చక్రవర్తుల శ్రీనివాస్, కర్రెం గౌరిశంకర్రావులు ధన్యవాదాలు తెలిపారు. పీఈటీల అప్‌గ్రేడేషన్ పట్ల పీఈటీ అసొసియేషన్ నేత విజయ్‌సాగర్ సైతం హర్షం వ్యక్తంచేశారు.