హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్యేలకు ఎర కేసులో సిట్ నోటీసులను సవాలు చేస్తూ బీజేపీ నేత బీఎల్ సంతోష్, జగ్గుస్వామి, తుషార్ వెల్లపల్లిలు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ కొనసాగించాల్సిన అవసరం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఆ పిటిషన్లపై జస్టిస్ జూకంటి అనిల్ కుమార్ మంగళవారం విచారణ చేపట్టారు.
పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదన వినిపిస్తూ.. నోటీసుల జారీకి కారణాలేమిటో సిట్ వెల్లడించకపోవడంతో గతంలో హైకోర్టు స్టే విధించిందని, పిటిషనర్లను ప్రతిపాదిత నిందితుల జాబితాలో చేర్చాలన్న సిట్ అభ్యర్థనను కింది కోర్టు కొట్టివేసిందని వివరించారు. అనంతరం పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావు వాదన వినిపిస్తూ.. పిటిషనర్లకు జారీచేసిన నోటీసులు అమల్లో లేవని, ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించామని తెలిపారు. దీంతో పిటిషనర్ల వ్యాజ్యాలపై విచారణ కొనసాగించాల్సిన అవసరంలేదని పేర్కొన్న న్యాయమూర్తి.. వాటిని మూసివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.