హైదరాబాద్, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ): గ్రూప్-1 పరీక్షల్లో అవకతవకలపై పిటిషన్ దాఖలు చేసిన వ్యక్తికి బెదిరింపులు వస్తున్నాయా? అని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పిటిషనర్‌కు రక్షణ కల్పించే అంశంపై వివరణ ఇవ్వాలంటూ సోమవారం ఆదేశాలు జారీ చేసింది.
2023లో నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలో అవకతవకలపై తాను పిటిషన్ దాఖలు చేయడంతో పరీక్షలు రద్దయిన నేపథ్యంలో తనకు బెదిరింపులు వస్తున్నాయని, రక్షణ కల్పించాలటూ బీ నర్సింగ్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ ఎన్ తుకారాంజీ సోమవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ..
హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన నేపథ్యంలో గ్రూప్-1 పరీక్షలను రద్దు చేయడంతో అందులో అర్హత సాధించిన అభ్యర్థులు బెదిరింపులకు దిగుతున్నారని వివరించారు. రక్షణ కల్పించాలంటూ డీజీపీకి వినతిపత్రం సమర్పించినా చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. దీనిపై వివరణ ఇవ్వడానికి గడువు కావాలని ప్రభుత్వ న్యాయవాది కోరడంతో న్యాయమూర్తి విచారణను ఈ నెల 9వ తేదీకి వాయిదా వేశారు.