హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): తమపై దాడిచేసిన కాంగ్రెస్ గూండాలపై కఠిన చర్యలు తీసుకోవాలని టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో బాధిత మహిళా జర్నలిస్టులు సరిత, విజయారెడ్డి శుక్రవారం డీజీపీ జితేందర్‌కు ఫిర్యాదు చేశారు. రుణమాఫీపై గ్రౌండ్ రిపోర్టుకు వెళ్లిన తమపై కొందరు ప్రవర్తించిన తీరు సభ్యసమాజం తలదించుకునేలా ఉన్నదని వివరించారు. రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛను కాపాడాలని కోరారు. స్పందించిన డీజీపీ ఇలాంటి వాటిని ఉపేక్షించబోమని, చట్టపరంగా చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారు.
అనంతరం బాధిత జర్నలిస్టులు మీడియాతో మాట్లాడుతూ మహిళలు ఇప్పుడిప్పుడే జర్నలిజంలోకి అడుగుపెడుతున్నారని, అలాంటి వారిపై సీఎం సొంత ఊరిలోనే దాడి జరగడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనను సీఎం రేవంత్‌రెడ్డి, పోలీసు శాఖ సీరియస్‌గా తీసుకుని నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఏ రమణకుమార్, హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి యార నవీన్‌కుమార్, ఐజేయూ సభ్యుడు అవ్వారి భాసర్, న్యూస్‌లైన్ శంకర్, ప్రవీణ్, ప్రభాకర్, జర్నలిస్టు సంఘం నాయకులు పాల్గొన్నారు.
నాగర్‌కర్నూల్ జిల్లా కొండారెడ్డిపల్లి, వెల్దండ గ్రామాల్లో గురువారం ఇద్దరు మహిళా జర్నలిస్టులపై జరిగిన దాడికి సంబంధించి నివేదిక ఇవ్వాలని రాష్ట్ర మహిళా కమిషన్ పోలీసులను ఆదేశించింది. బాధిత జర్నలిస్టులు సరిత, విజయారెడ్డి శుక్రవారం ఫిర్యాదు చేసిన వెంటనే స్పందించిన కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద నాగర్ కర్నూల్ ఎస్పీతో ఫోన్లో మాట్లాడారు. పూర్తి నివేదిక అంచాలని ఆదేశించారు.