హైదరాబాద్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోకి చట్ట వ్యతిరేకంగా చొరబడిన రోహింగ్యాలు, బంగ్లాదేశీయులను వారి స్వదేశాలకు తిరిగి పంపేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు మంగళవారం విచారించింది. దీనిపై సమగ్ర వివరాలను నివేదించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. తదుపరి విచారణ కోసం మార్చి 3కు వాయిదా వేస్తూ జస్టిస్ ఈవీ వేణుగోపాల్ మంగళవారం ఆదేశాలు జారీచేశారు. రాష్ట్రంలోకి అక్రమంగా వచ్చిన బంగ్లాదేశీయులు, రోహింగ్యాల తరలింపునకు చర్యలు తీసుకోవాలన్న వినతిపత్రాలపై ప్రభుత్వం స్పందించలేదని, ప్రభుత్వానికి తగిన ఉత్తర్వులు ఇవ్వాలని న్యాయవాది కరుణసాగర్ పిటిషన్ దాఖలు చేశారు. సీనియర్ న్యాయవాది రవీందర్ వాదనలు వినిపిస్తూ.. బంగ్లాదేశీయులు, రోహింగ్యాలు ఓటర్, రేషన్, ఆధార్‌కార్డులు పొందారని చెప్పారు. విచారణను మార్చి 3కు వాయిదా పడింది.