హైదరాబాద్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ సర్కార్ జీవో ఇచ్చింది. 24గంటలు తిరగకముందే ఆ జీవో కొట్టివేత కోసం అనుచరులతో కోర్టులో పిటిషన్లను దాఖలు చేయించింది, పిటిషన్ వేసింది కూడా సీఎం రేవంత్ అనుచరుడే. ఆయనే కాంగ్రెస్ పెద్దలకు అత్యంత సన్నిహితుడైన రెడ్డి జాగృతి వ్యవస్థాపక అధ్యక్షుడు కావడం గమనార్హం. మొత్తంగా బీసీ రిజర్వేషన్లపై మరోసారి వెన్నుపోటు పొడిచేందుకు కాంగ్రెస్ సర్కార్ సిద్ధమైందని తెలుస్తున్నది. 2018 లోనూ ఇదే విధంగా బీసీలకు 34% రిజర్వేషన్లు అమలుకాకుండా అడ్డుకున్నది కూడా కాంగ్రెస్ నేతలే. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లను కల్పిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం శుక్రవారం జీవో 9ను విడుదల చేసింది. 24గంటలు కాకముందే ఆ జీవోను సవాల్‌ను చేస్తూ రెడ్డి జాగృతి వ్యవస్థాపక అధ్యక్షుడు బుట్టంగారి మాధవరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు విధించిన 50% సీలింగ్‌కు ఈ రిజర్వేషన్లు వ్యతిరేకమని వాదించారు. జీవోను రద్దు చేయాలని కోర్టుకు విజ్ఞప్తిచేశారు.
విమర్శల వెల్లువ
బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టులో పిటిషన్ వేయడంపై సోషల్‌మీడియాలో విమర్శ లు వెల్లువెత్తుతున్నాయి. రెడ్డి జాగృతి అధ్యక్షు డు మాధవరెడ్డి, సీఎం రేవంత్ కలిసి ఉన్న ఫొ టోలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ప్రభుత్వం జీవో విడుదల చేసిన గం టల వ్యవధిలోనే మాధవరెడ్డి పిటిషన్దాఖలు చేశారు. దీనివెనక కాంగ్రెస్ పెద్దలే ఉన్నారని జోరుగా చర్చ జరుగుతున్నది. బీసీలకు 42% రిజర్వేషన్లను కల్పించడంపై కాంగ్రెస్ పెద్దలు సుముఖంగా లేరని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో జీవో ఇచ్చినట్టే ఇచ్చి అటకెక్కించేందుకు అనుచరులను ముందుపెట్టారని బీసీ నేతలు, నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు.