కరీంనగర్ తెలంగాణచౌక్, ఫిబ్రవరి 18: ఆర్టీసీ కార్మికులను వంచిస్తే ఊరుకోబోమని ఆర్టీసీ జేఏసీ వైస్ చైర్మన్ ఎం థామస్‌రెడ్డి హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని, ఎప్పుడు అమలు చేస్తారని, సంస్థను ప్రభుత్వంలో ఎప్పుడు విలీనం చేస్తారని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన అనేక హామీలను అధికారంలోకి రా గానే కాంగ్రెస్ విస్మరించిందని మండిపడ్డారు. బుధవారం కరీంనగర్‌లోని సీపీఐ కార్యాలయం బద్దం ఎల్లారెడ్డి భవన్లో ఏఐటీయూసీ నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో కార్మికులు సమ్మెకు దిగితే కాంగ్రెస్ నాయకులు వచ్చి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని వాగ్దానాలు చేశారని, తీరా అధికారంలోకి రాగానే చేతులెత్తేశారని మండిపడ్డారు.
మహాలక్ష్మి పథకంతో డ్రైవర్లు, కండక్టర్ల పని భారం పెరిగిందని, రోజుకు 16 గంటలు పని చేయాల్సిన దుస్థితి దాపురించిందని దుయ్యబట్టారు. ఉద్యోగులకు ఇస్తామన్న 2021 వేతన ఫిట్‌మెంట్‌ను వెంటనే అమలు చేయాలని, బ్రెడ్ విన్నర్ స్కీమ్‌లో పనిచేస్తున్న సిబ్బందిని రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ట్రేడ్ యూనియన్లపై ఆంక్షలు ఎత్తివేసి ఎన్నికలు నిర్వహించాలని, విశాంత్ర ఉద్యోగులను వెంటనే బెనిఫిట్స్‌ను అందించాలని కోరారు. కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ ఈ నెల 24న నిర్వహిస్తున్న చలో సెక్రటేరియట్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.