హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): లంబాడా, సుగాలి, బంజారాలను ఎస్టీల జాబితా నుంచి తొలగించాలని కోరుతూ భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, మాజీ ఎంపీ సోయం బాపూరావు తదితరులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బంజారా, లంబాడాలు, సుగాలీలు గిరిజనులు కారని, 1976 వరకు ఉమ్మడి ఏపీలోని తెలంగాణ జిల్లాల్లో వారిని ఎస్టీలుగా పరిగణించలేదని, ఇతర రాష్ట్రాల నుంచి వారు తెలంగాణకు వచ్చి గిరిజనుల హకులను కొల్లగొడుతున్నారని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. వాస్తవానికి వారు తొలుత బీసీల జాబితాలో ఉన్నారని తెలిపారు. దీంతో ఆ పిటిషన్ను విచారణకు స్వీకరించిన జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ బిష్ణోయ్ ధర్మాసనం.. పూర్తి వివరాలతో రిజాయిండర్ దాఖలు చేయాలంటూ శుక్రవారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది.