హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): కొత్తగూడెం శాసనసభ్యుడు, సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు ఎన్నికపై మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు వేసిన కేసును సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్బాగ్చీతో కూడిన ధర్మాసనం పిటిషన్ను అడ్మిషన్ సమయంలోనే తోసిపుచ్చింది. గతంలో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుపై తెలంగాణ హైకోర్టులో ఎన్నికల పిటిషన్ దాఖలైంది. జస్టిస్ కే లక్ష్మణ్ ఎదుట జరిగిన విచారణలో సీనియర్ న్యాయవాది విద్యాసాగర్ వాదనలు వినిపించారు. ఉభయ పక్షాల వాదనలు విన్న ధర్మాసనం జూన్ 9న ఆ పిటిషన్ కొట్టివేసింది. ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఎన్నిక విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ జలగం వెంకట్రావు సుప్రీంకోర్టులో అప్పీలు చేశారు. దీనిని గురువారం పరిశీలించిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం అడ్మిషన్ స్థాయిలోనే కొట్టివేసింది.