హనుమకొండ, మే 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలతో అన్నదాతలకు అన్నిరకాలుగా కష్టాలు, నష్టాలే మిగులుతున్నాయి. ఇప్పటికే డీజిల్, ఎరువుల ధరల పెంపుతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న రైతులపై మరో భారం పడింది. వానకాలం మొదలవుతున్న నేపథ్యంలో కంపెనీలు పురుగుమందుల ధరలు భారీగా పెంచేశాయి. డైపెథారిన్ కిలో ధర రూ.3,200 నుంచి రూ.3,600కు పెరిగింది. ఇమిడాక్లోఫ్రిడ్ లీటర్ ధర రూ.900 నుంచి రూ.1,200కు చేరింది.
అన్ని రకాల పురుగు మందుల ధరలు సగటున ఒక్కో లీటరుపై రూ.200 వరకు పెరిగాయి. దీంతో రైతులకు పెట్టుబడి భారం మరింత పెరుగనున్నది. పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు వచ్చే పరిస్థితి లేకపోవడంతో పెట్టుబడి ఖర్చులు, రాబడి మధ్య వ్యత్యాసం పెరిగి రైతులు మరోసారి నష్టపోయే ప్రమాదం నెలకొన్నది. పశ్చిమాసియాలో యుద్ధం సాకుతో కేంద్ర ప్రభుత్వం డీజిల్ ధరలను పెంచింది. ఇదే కారణంగా చూపి ఎరువుల కంపెనీలు కూడా ధరలను పెంచాయి. ఇప్పుడు పురుగుమందుల కంపెనీలు కూడా అదే చేశాయి.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుతో రైతులకు అన్ని రకాల ఇబ్బందులే నెలన్నాయి. రైతు భరోసాలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పెట్టుబడి సాయాన్ని ఎగవేస్తున్నది. మరోవైపు యూరియా దొరక్క రైతులు ఇబ్బందులుపడుతున్నారు. పండించిన పంటను కొనకుండా రాష్ట్ర ప్రభుత్వం గోస పెడుతున్నది. అన్ని రకాల ఇబ్బందులతో గత ఏడాది రైతులకు నష్టాలే మిగిలాయి. వచ్చే ఏడాది సాగు కోసం ఎంతో ఆశలతో సిద్ధమవుతున్న రైతులకు.. డీజిల్, ఎరువులు, పురుగు మందుల ధరలు పెరుగడంతో ఆరంభంలోనే ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయి.
