Telangana | హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఫిబ్రవరి 11(నమస్తే తెలంగాణ): మొన్నటిదాకా కళకళలాడిన హైదరాబాద్ మహా నగర రియల్ఎస్టేట్, నిర్మాణ రంగాలు నేలచూపు చూస్తున్నాయి. అమ్మేవారున్నా… కొనేవారు లేక కుదేలవుతున్నాయి. భారీ నిర్మాణ సంస్థలే కాదు, చిన్నపాటి బిల్డర్లు మొదలు లక్షలాదిగా ఉన్న రియల్ఎస్టేట్ బ్రోకర్లు ఎవరి స్థాయిలో వాళ్లు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. హైడ్రా, బహిరంగ మార్కెట్లో ఉన్న స్తబ్ధత కారణాలు ఏమైనప్పటికీ సామాన్యులు సొంతింటి కలను వాయిదా వేసుకుంటున్నారు. ఈ వాస్తవం అనేక సర్వే ల్లో వెల్లడవుతున్నా ప్రభుత్వం మాత్రం అదేమీ లేదంటూ కొట్టిపారేస్తున్నది. తాజాగా అధికారిక లెక్కలను పరిశీలించినా నిర్మాణరంగం క్రమంగా కుదేలవుతున్నద నే సంకేతాలు స్పష్టమవుతున్నాయి. రియల్ఎస్టేట్, నిర్మాణ రంగాలంటేనే శివారు ప్రాంతాలు.
అలాంటిది రెండేండ్లతో పోలి స్తే చుట్టూ మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో నిర్మాణ అనుమతుల్లో భారీ తగ్గుదల నమోదుకావడం క్షేత్రస్థాయి పరిస్థితికి అద్దం పడుతున్నది. 2019లో ఈ రెండు రంగాలు తారస్థాయికి చేరుకున్నాయి. ఆ తర్వాత అనూహ్యంగా కొవిడ్‌తో లావాదేవీలు, క్రయవిక్రయాలు కాస్త మందగించాయే కానీ భారీ తగ్గుదల నమోదు కాలే దు. అందుకే కొవిడ్ సమయంలో కేసీఆర్ ప్రభుత్వం నిర్మాణ రంగానికి లాక్డౌన్ నుంచి మినహాయింపు ఇవ్వాల్సి వచ్చిం ది. కొవిడ్ అనేది రెండు రంగాలకు ఒక స్పీడ్ బ్రేకర్‌గా మాత్ర మే మారింది. కానీ, దూకుడు ను తగ్గించలేకపోయింది. నగ రం చుట్టూ ఉన్న స్థానిక సంస్థల పరిధిలో 2021, 2022 సంవత్సరాల్లో అనుమతుల సంఖ్య ను చూస్తే ఇదే విషయం అర్థమవుతుంది. ప్రధానంగా 2021 నుంచి 2022కు అనుమతులు 22% మేర పెరిగాయి.
పడిపోతున్న అనుమతులు
రాష్ట్రంలో 2023 డిసెంబర్ లో కాంగ్రెస్ అధికారంలోకి వ చ్చింది. 2024 ఆదిలో రియల్ ఎస్టేట్-నిర్మాణ రంగాల్లో కొంతమేర స్తబ్ధత నెలకొన్నా అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల నేపథ్యం లో మార్కెట్ ఇలాగే ఉంటుంద ని నిపుణులు సైతం అనుకున్నారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత హైదరాబాద్ రియల్ఎస్టేట్ నిర్మాణ రంగాలు ఊపందుకుంటాయని చెప్పారు. హైడ్రా దూకుడు గా నిర్మాణాల కూల్చివేత చేపట్టడంతో రేపో మాపో కోలుకుంటుందనుకున్న రియల్ ఎస్టేట్-నిర్మాణ రంగాల్లో అదే స్తబ్ధత కొనసాగడంతోపాటు తగ్గుదల మొ దలైంది. 2023తో పోలిస్తే 2024లో 16 స్థానిక సంస్థల పరిధిలో అనుమతులు ఏకంగా 36% తగ్గాయంటే పరిస్థితి ఎంత ఆందోళనకరంగా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. దాని ఫలితంగానే రియల్టర్లు, బిల్డర్లు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నారు. దాని పర్యవసానంగానే నిర్మాణరంగంలో ఆత్మహత్యలు చోటుచేసుకోవడం దురదృష్టకరం.
‘కూల్చకు సారూ.. నీ కాల్మొక్త!’
‘సార్.. మేం గరీబోళ్లం.. ఎన్నో ఏండ్ల నుంచి ఈడనే ఉంటున్నం. మా గుడిసెలను కూల్చకండి.. మీ కాల్మొక్త! ’ అంటూ ఓ మహిళ పోలీస్ అధికారి కాళ్లు పట్టుకొని బతిమిలాడింది. జవహర్‌నగర్ కార్పొరేషన్ దేవేందర్‌నగర్‌లో ప్రభుత్వం మంగళవారం గుడిసెలను తొలగించింది. తన గుడిసెను కూల్చొద్దంటూ మోతీబాయి అనే మహిళ పోలీస్ అధికారి కాళ్లపై పడి వేడుకున్నా.. వారు కనికరించలేదు. క్షణాల్లో ఆమె గుడిసెను నేలమట్టం చేశారు. పేదల పట్ల ప్రభుత్వ తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.