ప్రతి నీటిబొట్టునూ ఒసిడిపట్టి పొలాలకు మళ్లించి రైతులకు వెన్నుదన్నుగా నిలిచేందుకు కేసీఆర్ సర్కార్ హయాంలో చెక్‌డ్యామ్‌లు కట్టించి వాగులను జీవనాడులుగా మారిస్తే.. కాంగ్రెస్ పాలనలో అవే వాగుల్లో ఇసుక దొంగలు పడ్డారు. వందలాది గ్రామాల వ్యవసాయానికి ఆయువుపట్టుగా ఉన్న ఒక్క మోయతుమ్మెద వాగుపైనే ఏకంగా 19 ఇసుక రీచ్‌లు పెట్టి ఇష్టారీతిన ఇసుక కొల్లగొడుతున్నారు. రెండున్నరేండ్ల కింది దాకా నీటితో కళకళలాడిన వాగులు, ఇప్పుడు చుక్క నీరు లేక వట్టిపోవడమే కాకుండా మున్ముందు వాటి మనుగడే ప్రశ్నార్థకం కావడంతో రైతులు,
పర్యావరణ వేత్తలు ఆందోళన చెందుతున్నారు.
సిద్దిపేట, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): వాగులను ఇసుక దొంగలు చెరబడుతున్నారు. ‘మన ఇసుక వాహనం’ పేరిట దొరల్లాగా చెలరేగిపోతున్నారు. నామమాత్రపు అనుమతులు పొంది ఇష్టారీతిన ఇసుక రీచ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో అనేక వాగుల్లో మునుపెన్నడూ లేని రీతిలో ఇసుక రీచ్‌లు ఏర్పాటయ్యాయి. ఒక్క సిద్దిపేట జిల్లాలోని వివిధ వాగులపై దాదాపు 28 ఇసుక రీచ్‌లకు అనుమతులు ఇచ్చారు. స్థానిక అవసరాల మాటున భారీగా ఇసుక అక్రమ దందా మొదలైంది. పగలు, రాత్రులు అనే తేడా లేకుండా ఇసుక తోడేస్తుండటంతో వాగులన్నీ వట్టిపోతున్నాయి. భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయి. దీంతో పరిసర ప్రాంతాల ప్రజలు, రైతులు ఆందోళన చెందుతున్నారు. సిద్దిపేట జిల్లాకు మోయతుమ్మెద పెద్ద వాగే దిక్కు. ఈ వాగు చేర్యాల, ధూళిమిట్ట, నంగునూరు, కోహెడ మండలాల మీదుగా ప్రవహిస్తుంది. ఇదేవాగుపై బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విరివిగా చెక్ డ్యామ్‌లు నిర్మించింది. ఫలితంగా భూగర్భజలాలు గణనీయంగా పెరిగి పంటలసాగు విస్తీర్ణం పెరిగింది.
పల్లెల్లో కాంగ్రెస్ సర్కార్ చిచ్చు
పచ్చని పంటలతో కళకళలాడుతున్న మోయతుమ్మెద పెద్ద వాగు పరీవాహక గ్రామాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చిచ్చు పెట్టింది. ఈ వాగుపైనే ఎన్నడూ లేనిది కొత్తగా 19 ఇసుక రీచ్‌లకు అనుమతులు ఇచ్చింది. అక్కెనపల్లి, ఆకునూరు, అర్జున్‌పట్ల, భైరాన్‌పల్లి, ధూళిమిట్ట, దొమ్మాట. గాగిళ్లాపూర్, కమలాయపల్లి, ఖాతా, కూరెళ్ల, జాలపల్లి, నంగునూరు, పోరెడ్డిపల్లి, రామచంద్రాపూర్, తాడూరు, తంగళ్లపల్లి, తోటపల్లి, వరికోలు, వింజపల్లి గ్రామాలతోపాటు చిన్నవాగుల వద్ద సైతం వెబ్సైట్లో ఇసుక రీచ్‌లకు అనుమతులు ఇవ్వడం అభ్యంతరాలకు దారితీసింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనూ 39 చోట్ల వాగులపై అనుమతులు మంజూరుచేశారు. ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం తదితర జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొన్నది. ఫలితంగా ఆయా వాగులన్నీ మళ్లీ గుల్లవుతున్నాయి. ఎక్కడికక్కడ వట్టిపోయి జలరాశులు మాయమవుతున్నాయి.
‘మన ఇసుక వాహనం’ పేరిట ఇష్టారాజ్యం
ఇటీవల స్థానిక గృహ, ఇతర నిర్మాణ పనుల కోసం ఇసుక కొరత నివారణ పేరిట ప్రభుత్వం ‘మన ఇసుక వాహనం’ విధానాన్ని తీసుకొచ్చింది. స్థానిక వాగుల్లో ఇసుక తవ్వకాలకు యథేచ్ఛగా అనుమతులు ఇస్తున్నది. ఇసుక అవసరాలున్న స్థానికులు వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకుంటారు. నిర్ణీత ఫీజు చెల్లించి నిర్దేశిత రీచ్ పాయింట్ నుంచి ఇసుకను తీసుకెళ్లాల్సి ఉంటుంది. అక్కడి వరకు బాగానే ఉన్నది. కానీ స్థానికం పేరిట ఇప్పుడు బాహాటంగానే ఇసుక అక్రమ దందా కొనసాగుతున్నది. స్థానికుల పేరిట ఇసుకను బుక్ చేసుకుంటూ అక్రమంగా ఇతర దూర ప్రాంతాలకు దానిని తరలిస్తున్నారు. ఒక్క ట్రాక్టర్ ఇసుకకు అనుమతి పొంది 10కిపైగా ట్రాక్టర్లలో ఇసుకను ఆయా వాగుల నుంచి తోడేస్తున్నారు. అనుమతులపై సరైన పర్యవేక్షణ లేక ఈ ఇసుక అక్రమ దందా సాగుతున్నదని బాధిత గ్రామాల ప్రజలు మండిపడుతున్నారు. ఇలాంటి ఇసుక అక్రమ దందాను అరికట్టాలని కోరుతూ మోయతుమ్మెద గ్రామ పంచాయతీ పాలకవర్గం తీర్మానాలు చేసి కలెక్టర్ నుంచి మండల స్థాయి అధికారుల వరకూ వినతిపత్రాలను సమర్పించింది.
ప్రమాదంలో వాగుల భవితవ్యం
నిరంతరం అడ్డూఅదుపు లేకుండా ఇసుకను తోడుతుండటంతో భూగర్భజలాలు అడుగంటి రాష్ట్రంలో పలు వాగుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారుతున్నది. సాగు, తాగునీటికి ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. చెక్‌డ్యామ్‌ల సమీపంలో ఇష్టారీతిన ఇసుకను తొలగిస్తే దాని నిర్మాణంపై తీవ్ర ప్రభావం చూపి, చెక్‌డ్యామ్‌లు దెబ్బతినే ప్రమాదం ఉన్నదని ఇరిగేషన్ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇసుక అక్రమ తవ్వకాల వల్ల భూగర్భజలాలు పడిపోయి పంట భూములు దెబ్బతినడం, వంతెనలు కూలే ప్రమాదంతోపాటు వాగు మార్గం మారిపోవడం, పర్యావరణ నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయని రైతులు, పర్యావరణ వేత్తలు ఆందోళన చెందుతున్నారు. మోయతుమ్మెద వాగు భవిత కూడా ఇదేరీతిన దెబ్బతింటుందని పరిసర గ్రామాల ప్రజలు, ముఖ్యంగా రైతులు గుబులు చెందుతున్నారు. ఒకప్పుడు ఏడాది పొడవునా నీరు ఉండే బావులు ఇప్పుడు వేసవి రాకముందే ఎండిపోతున్నాయని, అది నేరుగా తాగునీటితోపాటు వ్యవసాయంపైనా ప్రభావం పడుతుందని చెప్తున్నారు.
నిబంధనలు బేఖాతరు
మైనింగ్, పర్యావరణ, భూగర్భ జలాల శాఖల అనుమతులతో పాటు గ్రామ పంచాయతీ/స్థానిక ప్రజలు, రైతుల అభిప్రాయాలు, జియాలజిస్టులు, ఇంజినీర్లు సైట్ సర్వే చేసి ఇసుక నిల్వలను అంచనా వేసి ఇచ్చిన నివేదిక ఆధారంగానే ఇసుక తవ్వకాలకు అనుమతులు ఇవాల్సి ఉంటుంది. వాగు పుట్టిన ప్రదేశం, అటవీ ప్రాంతాలు, వంతెనలు, చెక్‌డ్యామ్‌ల వద్ద, తాగునీటి ప్రాజెక్టుల పరిసరాలు, వరద ప్రమాద ప్రాంతాల్లో ఎలాంటి అనుమతులు ఇవ్వకూడదు. చెక్‌డ్యామ్ నిర్మాణ ప్రదేశం నుంచి సుమారు 500 మీటర్ల వరకు ఎలాంటి అనుమతులు ఇవ్వకూడదు. ఈ నిబంధనలను పాటించకుండానే రెవెన్యూ అధికారులు ఇష్టారీతిన ఇసుక తవ్వకాలకు అనుమతులు ఇస్తున్నారు. వాడుకలో ఉన్న చెక్‌డ్యామ్‌లు, పేరుకుపోయిన పూడికను తొలగించేందుకు పర్యావరణ అనుమతులు అవసరం లేదనే నిబంధన సాకుతో అధికార పార్టీ నేతల అండదండలతో ఇసుక మాఫియా ఇష్టారీతిన చెలరేగిపోతున్నదని ఇరిగేషన్ శాఖ అధికారులు, సామాజిక, పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.