హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ) : విదేశాల్లో ఎంబీబీఎస్ పూర్తిచేసిన భారతీయ వైద్య విద్యార్థులకు జాతీయ వైద్య కమిషన్(ఎన్ఎంసీ) తాజా మార్గదర్శకాల ప్రకారం పర్మినెంట్ రిజిస్ట్రేషన్(పీఆర్) కల్పించాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కోఠి హెల్త్ క్యాంపస్‌లోని తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఎదుట బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో వైద్య విద్యార్థులతో కలిసి నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొవిడ్, యుద్ధ పరిస్థితుల కారణంగా విదేశాల్లో వైద్య విద్యనభ్యసించిన విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్(ఎఫ్ఎంజీఈ) ఉత్తీర్ణత సాధించి, అవసరమైన కంపెన్సెషన్ శిక్షణ, ఇంటర్న్‌షిప్ పూర్తిచేసిన విద్యార్థులకు అడ్డంకులు సృష్టించకుండా పీఆర్ మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
విదేశీ విశ్వవిద్యాలయాల్లో అవసరమైన ఫిజికల్ ఆన్సైట్ కంపెన్సెషన్ పూర్తిచేసిన ఎఫ్ఎంజీ విద్యార్థులకు అదనపు క్లర్క్‌షిప్ విధించకుండా పీఆర్ ఇవ్వాలని ఈ ఏడాది మార్చి 18న ఎన్ఎంసీ ఆదేశాలిచ్చినట్టు గుర్తుచేశారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తర్‌ప్రదేశ్‌లలో అర్హులైన వారికి ఆయా రాష్ర్టాల మెడికల్ కౌన్సిల్లు పర్మినెంట్ రిజిస్ట్రేషన్ ఇచ్చినట్టు గెల్లు శ్రీనివాస్ తెలిపారు. కార్యక్రమంలో భానుప్రసాద్ భీమినేని, జయంత్‌రెడ్డి ఆశం, వెంకటకృష్ణ, బీఆర్ఎస్వీ నాయకులు కోదాటి నాగేందర్, కాల్వ నితీశ్, రెహ్మత్, అఫ్రిద్, మజ్, మాతల్లి తదితరులు పాల్గొన్నారు.