హైదరాబాద్, మే 26(నమస్తే తెలంగాణ): గ్రామ పంచాయతీ కార్యదర్శులు పనితీరును మెరుగు పర్చుకోవాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క సూచించారు. కార్యదర్శుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉన్నదని తెలిపారు. సోమవారం సచివాలయంలో పంచాయతి సెక్రటరీస్ ఫెడరేషన్ సభ్యులు మంత్రి సీతక్కతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. శాఖ పరిధిలో ఉండే అంశాలను వీలైనంత త్వరగా పరిషరిస్తామని హామీ ఇచ్చారు.
ఉద్యోగుల సమస్యలపై ఏర్పాటైన క్యాబినెట్ సబ్ కమిటీ దృష్టికి పంచాయతీ కార్యదర్శుల సమస్యలను తీసుకెళ్లి పరిషరిస్తామని చెప్పారు. గ్రామాల్లో సర్పంచుల పదవీ కాల పరిమితి అయి పోవడం వల్ల అత్యవసర పనుల కోసం పంచాయతీ కార్యదర్శులు సొంత నిధులు వెచ్చించారని, వారి బిల్లులను త్వరలో విడుదల చేస్తామని మంత్రి సీతక్క పేర్కొన్నారు. సమావేశంలో తెలంగాణ పంచాయతీ సెక్రటరీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు శ్రీకాంత్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి నాగరాజు, గౌరవాధ్యక్షుడు సందీప్, కోశాధికారి శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
టీచర్లను పంచాయతీరాజ్‌శాఖ పరిధిలోకి తీసుకోండి ; సీతక్కకు లోకల్ క్యాడర్ గవర్నమెంట్ టీచర్స్ విజ్ఞప్తి
హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ టీచర్లను పంచాయతీరాజ్‌శాఖ పరిధిలోకి తీసుకోవాలని లోకల్ క్యాడర్ గవర్నమెంట్ టీచర్స్ అసోసియేషన్(జీటీఏ) ప్రభుత్వాన్ని కోరింది. 73వ రాజ్యాంగ సవరణ ప్రకారం జిల్లా, మండల పరిషత్ టీచర్లు జడ్పీ సీఈవోలు, ఎంపీడీవోల పరిధిలో పనిచేయాలని, ఈ దిశగా చర్యలు తీసుకోవాలని కోరింది. అసోసియేషన్ అధ్యక్షుడు మామిడోజు వీరాచారి నేతృత్వంలోని ప్రతినిధి బృందం సోమవారం మంత్రి సీతక్కను కలిసి వినతిపత్రం సమర్పించారు. విద్యశాఖకు 23వేల కోట్లను బడ్జెట్లో కేటాయించారని, కానీ ఫలితాలు అందడంలేదని, అదే జడ్పీ సీఈవోలు, ఎండీపీవోల పర్యవేక్షణ పెరిగితే విద్యాప్రమాణాలు మెరుగవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల లక్ష్మీకాంత్‌రెడ్డి, కోశాధికారి ఎం నళిని, మహిళా కార్యదర్శి కే సుకన్య తదితరులు వినతిపత్రం సమర్పించిన వారిలో ఉన్నారు.