మదనాపురం, మార్చి 18 : ప్రాణాలు పణంగా పెట్టి తాగు నీటిని తెచ్చుకుంటున్నారు వనపర్తి జిల్లా మదనాపురం మండలం కొన్నూర్ గ్రామంలోని బుడగ జంగాల కాలనీ వాసులు. స్థానికంగా నీటి ఎద్దడి నెలకొనడంతో నిత్యం రైల్వే పట్టాలు దాటాల్సిన ప్రమాదకర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. నీటి సమస్యతో విసిగిపోయిన కాలనీవాసులు మంగళవారం రోడ్డుపై బైఠాయించారు.
నీటి కోసం గ్రామంలోకి వెళ్లి మిషన్ భగీరథ నీటిని పట్టుకొని బిందెలతో రైలు పట్టాలు దాటాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రమాదమని తెలిసినా తప్పడం లేదని వాపోతున్నారు. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని, వెంటనే తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.