సిరిసిల్లలో బీఆర్ఎస్వీ విద్యార్థి నాయకులపై దాడిని బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పడాల సతీశ్ తీవ్రంగా ఖండించారు. తెలంగాణలో సీఎ రేవంత్ రెడ్డి బుద్ధులు కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా వచ్చినట్లు ఉన్నాయని విమర్శించారు. చిల్లర రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి అతి త్వరలో ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు. ప్రజల కోసం నిరంతరం కష్టపడుతూ ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ అడుగడుగునా ప్రశ్నిస్తున్న తమ నాయకులపై కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
గతంలో హైదరాబాద్ విద్యానగర్‌లో కేటీఆర్ కాన్వాయ్‌పై దాడికి దిగారని, ఖమ్మం వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన హరీశ్‌రావు కారుపై దాడికి పాల్పడ్డారని, హెచ్‌సీయూ భూములను అక్రమంగా తీసుకోవడానికి ప్రయత్నించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేరకంగా పోరాటం చేసిన విద్యార్థులపై కాంగ్రెస్ పార్టీ దాడి చేసిందని పడాల సతీశ్ తెలిపారు. ఈ దేశానికి 70 సంవత్సరాలుగా పట్టిన శని కాంగ్రెస్ పార్టీ అని మండిపడ్డారు. సిరిసిల్లలోని బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్, పార్టీ నాయకుపై, విద్యార్థి విభాగం నాయకులపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ, రాబోయే రోజుల్లో ప్రతి దాడులు ఉంటాయని హెచ్చరించారు. ఈ చిల్లర రాజకీయాలు చేస్తున్న రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.