Rahul Gandhi | రఘునాథపాలెం, జూలై 2: ఆయ నో జాతీయ పార్టీ అగ్రనేత.. అంతటి వ్యక్తి సభలు, సమావేశాల్లో ప్రసంగిస్తే జనం మైమరిచిపోయేలా ఉండాలి. తన పార్టీ అధికారంలోకి వస్తే ఏ విధమైన పాలన అందిస్తామో తెలియజేయాలి. కానీ ఖమ్మం నగరంలో తెలంగాణ పీసీసీ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం జరిగిన తెలంగాణ జనగర్జన సభ పసలేకుండా సాగింది. సభ ప్రధాన ఉద్దేశమేమిటో వచ్చిన జనాలకే అర్థంకాలేదు. ఖమ్మం సభతో బీఆర్ఎస్ను అది చేస్తాం.. ఇది చేస్తామంటూ విర్రవీగిన ఆ పార్టీ నేతలు.. సభకు వచ్చిన కార్యకర్తలతోనే ఈసడించుకునేలా చేసుకున్నారు. సభలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రసంగం అంతకంటే పస లేకుండాపోయింది.
ఆయన తన ప్రసంగాన్ని మొదలు పెట్టగా పార్టీ నేత ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలుగులోకి అనువదించారు. రాహుల్ గాంధీ మాట్లాడిన మాటల్లో సగం మాత్రమే ఆయన తెలుగులో చెప్పగలిగారు. ప్రసంగం పేలవంగా సాగడం, అర్థం కాకపోవడంతో సభ కు వచ్చిన వారు అయోమయానికి గురయ్యారు. సభ జరుగుతుండగానే నాయకులు కుర్చీల్లోంచి లేచి వెళ్లిపోవడం కనిపించింది. కనీసం పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రసంగించకపోవడం కార్యకర్తల్లో అనేక ప్రశ్నలకు తావునిచ్చినట్లయింది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తాను చేసిన పీపుల్స్ మార్చ్ గురించి గొప్పగా చెప్పుకోవడం తప్ప పార్టీ నేతలకు ఇచ్చిన సందేశం ఏమీ లేదని ఆ పార్టీ నాయకులే పెదవి విరవడం గమనార్హం.
ఫ్లకార్డును విసిరేసిన పొంగులేటి
ఖమ్మంలో ఆదివారం జరిగిన కాంగ్రెస్ పార్టీ జన గర్జన సభలో ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తమ పార్టీ అధికారంలోకి వస్తే వితంతువులు, దివ్యాంగులకు నెలకు రూ.4 వేల చొప్పున పింఛన్ ఇస్తామని ప్రకటించారు. అనంతరం ప్రకటనకు సంబంధించిన ఫ్లకార్డులను ఆవిష్కరించారు. ఆవిష్కరణ పూర్తగానే మాజీ ఎంపీ పొంగులేటి తన చేతిలోని ఫ్లకార్డును కిందకు విసిరేయడంపై నాయకులు పెదవి విరిచారు. ఒకవేళ మున్ముందు కాంగ్రెస్ పార్టీ గెలిస్తే పింఛన్ పంపిణీ కూడా ఇలాగే ఉంటుందా? అని మండిపడ్డారు.