హైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ): భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్తుతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని టీఎస్ఎస్పీడీఎల్ సీఎండీ రఘుమారెడ్డి సూచించారు. సోమవారం విద్యుత్తు సూపరింటెండింగ్ ఇంజినీర్లు, చీఫ్ జనరల్ మేనేజర్లతో రఘుమారెడ్డి ఆడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.వర్షంలో విద్యుత్తు లైన్లు, స్థంభాలు, ఇతర విద్యుత్తు పరికరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు. రోడ్డు మీద, నీటిలో గానీ కరెంటు తీగ పడి ఉన్నట్టు గమనిస్తే దాన్ని తాకకుండా జాగ్రత్త ఉండాలని, వైర్లు తెగిపడినట్టు కనిపిస్తే వెంటనే విద్యుత్తు సిబ్బందికి ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్తు సిబ్బంది, అధికారులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. సేడాలో ప్రత్యేక కంట్రోల్‌రూమ్ ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. ఎక్కడైనా కరెంటు వైర్లు తెగి పడి ఉంటే 1912, 100, 73820 71574,7382072106, 73820 72104, 9000113667 (డీఆర్ఎఫ్) నంబర్లలో సంప్రదించాలని సూచించారు.