జోగులాంబ గద్వాల : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రకు జిల్లాలో అడుగడుగున స్థానికుల నుంచి నిరసన సెగ తగిలింది. ఈ నెల 15న ఆలంపూర్ జోగులాంబ ఆలయం నుంచి ప్రారంభమైన బండి పాదయాత్రపై ఇప్పటికే ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సోమవారం ఇటిక్యాల మండలం వేముల షాబాద్ గ్రామాల మధ్య దారిలో స్థానికులు, టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు బండి సంజయ్ యాత్రకు అడ్డుగా వచ్చి నిరసన తెలిపే ప్రయత్నం చేశారు.
పెట్రోలు, డీజిల్, గ్యాస్, నిత్యావసర ధరలు భారీగా పెంచి సామాన్యుడి నడ్డి విరుస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీగా.. ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా సమాధానం చెప్పి తీరాలని స్థానికులు పట్టుబట్టారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న స్థానికులు, టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకుల పై బీజేపీ గుండాలు దాడి చేశారు. స్థానికులను, టీఆర్ఎస్ కార్యకర్తలను చితకబాదారు.
టీఆర్ఎస్ కార్యకర్తకుకు చెందిన ఓ కారును బీజేపీ గుండాలు ధ్వంసం చేశారని స్థానికులు తెలిపారు.
శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వచ్చిన స్థానిక మహిళలపై కూడా బీజేపీ నాయకులు దౌర్జన్యం చేశారు. దేశవ్యాప్తంగా ధరలు పెంచుతూ ప్రజల నడ్డి విరుస్తున్న బీజేపీ ప్రభుత్వం సమాధానం చెప్పలేక తమపై దాడికి దిగిన దని స్థానికులు తెలిపారు. బీజేపీ నాయకుల దౌర్జన్యంపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు.