దుబ్బాక టౌన్, నవంబర్ 5: ‘రైతు చనిపోతే రాలేదు.. ఇప్పుడేమో కొబ్బరికాయ కొట్టడానికి వచ్చావా?’ అంటూ బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావును రైతులు నిలదీశారు. శనివారం సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పద్మశాలీగడ్డ పంచాయతీ మధిర గ్రామం నర్లెంగ గడ్డలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించేందుకు వచ్చిన రఘునందన్‌పై రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘యాసంగిలో కొనుగోలు కేంద్రంలో పిడుగుపడి రైతు చనిపోతే రాకపోతివి.. ఎమ్మెల్యే వస్తాడు.. ఓదారుస్తాడని ఎంతోమందికి చెప్పితిమి.. ఆపతికి రాని నువ్వు ఇప్పుడు వడ్లు రాగానే కొబ్బరికాయ కొట్టడానికి వచ్చావా?’ అంటూ ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులు నిలదీశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయంటూ రఘునందన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ గందరగోళం మధ్యే కొనుగోలు కేంద్రంలో కొబ్బరికాయ కొట్టిన ఎమ్మెల్యే రైతులకు సమాధానం చెప్పకుండానే వెనుదిరిగారు.