హైదరాబాద్, జులై 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి స్త్రీ, శిశు సంక్షేమశాఖ ఉద్యోగులు క్షీరాభిషేకం చేశారు. కాంట్రాక్ట్ సూపర్వైజర్లుగా పనిచేస్తున్న తమను రెగ్యులరైజ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న స్త్రీ, శిశు సంక్షేమశాఖలోని 143 మంది గ్రేడ్-3 కాంట్రాక్ట్ సూపర్వైజర్లను క్రమబద్ధీకరించి సీఎం కేసీఆర్ మరోసారి తన మానవీయతను చాటుకొన్నారని టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మామిండ్ల రాజేందర్, కార్యదర్శి రాయకంటి ప్రతాప్, టీఎన్జీవో స్త్రీ, శిశు సంక్షేమశాఖ విభాగం అధ్యక్షుడు జీ పున్నారెడ్డి, కార్యదర్శి రమణకుమార్, రమణారెడ్డి, ఉదయ్‌కుమార్, బాలరాజు, స్వరూప, కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఘం నాయకురాలు నారాయణమ్మ, పద్మజ, శీలావతి తదితరులు కొనియాడారు. సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. మహిళా ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తున్న మంత్రి సత్యవతి రాథోడ్, స్త్రీ, శిశు సంక్షేమశాఖ కమిషనర్ దివ్యా దేవరాజన్‌కు టీఆర్ఎస్కేవీ రాష్ట్ర అధ్యక్షురాలు నల్లా భారతి ధన్యవాదాలు తెలిపారు.