Rahul Gandhi | హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): అయ్యా! ఇండ్ల పట్టాలు ఇవ్వండి అని అడిగితే ప్రాణాలు తీసిన చరిత్ర కాంగ్రెస్‌ది అని యావత్తు తెలంగాణ ఆ పార్టీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆదివారం ఖమ్మం సభలో రాహుల్‌గాంధీ ప్రకటించిన హామీలపై ధ్వజమెత్తింది. నాడు ముదిగొండలో జరిగిన కాల్పుల మారణ హోమాన్ని గుర్తు చేసుకొంటూ హస్తం పార్టీపై దుమ్మెత్తిపోస్తున్నది. తెలంగాణవాదులు సోషల్ మీడియా వేదికగా నాటి ఘటనను గుర్తు చేస్తూ.. ఛీ! కాంగ్రెస్‌కు కొంచెమైనా సిగ్గుండాలంటూ మండిపడుతున్నారు. 2008 జూలైలో పేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని కమ్యూనిస్టు పార్టీలు రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి.
7 రోజుల పాటు జరిగిన నిరసనల్లో చివరి రోజు 2008 జూలై 27న ముదిగొండలో సీపీఎం ఆధ్వర్యంలో రాయల వెంకటేశ్వర్లు, బండి రమేశ్, వాసిరెడ్డి వరప్రసాద్‌తోపాటు 7 ప్రధాన నాయకులు నిరాహార దీక్ష చేపట్టారు. నాటి కాంగ్రెస్ పాలకుల ఆదేశంతో పోలీసులు ఆ నిరసన విరమింపచేసేందుకు యత్నించగా, తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటుచేసుకున్నది. పోలీసులు లాఠీచార్జి చేయగా, ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు ఏడుగురిని కాల్చి చంపారు. కాల్పుల్లో 6 అకడికకడే చనిపోగా ఒకరు చికిత్స పొందుతూ తర్వాత రోజు మరణించారు. వారిలో ఒక మహిళ, ఆరుగురు పురుషులు ఉన్నారు.
ఈ ఘటనలో ముగ్గురు పోలీసులు, మరో 20 మంది పౌరులకు గాయాలయ్యాయి. దీనిపై విచారణకు ప్రభుత్వం విశ్రాంత జడ్జి పాండురంగారావుతో కమిషన్ ఏర్పాటు చేసింది. అయితే ఖమ్మం సభలో తాము అధికారంలోకి వస్తే పట్టాలిస్తామని రాహుల్ గాంధీ ప్రకటించారు. దీంతో ‘ముదిగొండ ఘటన యాదికిలేదా రాహుల్? పట్టాలు అడిగితే ప్రాణాలు తీశారు. రోడ్లపై రక్తం ఏరులై పారింది. దాన్నెలా మర్చిపోతాం. ఇప్పుడు చిలక పలుకులా?’ అని కాంగ్రెస్ తీరును సోషల్ మీడియాలో ఎండగట్టారు.