Lagcherla | కృష్ణా నదిలోని వరద నీటిని మాత్రమే వాడుకుంటాం’.. ఇది పోతిరెడ్డిపాడు కట్టడానికి ప్రాతిపదిక కోసం నాటి సమైక్య పాలకులు చెప్పిన మాట. ‘కాలువల ఆధునికీకరణ ద్వారా కృష్ణానదిలో 7 టీఎంసీలు మిగులుతాయి. ఆ మిగులు జలాలను మాత్రమే వాడుకుంటం’ ఇప్పుడు రేవంత్ సర్కార్ పాలమూరు రైతులకు చెప్తున్న మాట. కానీ లగచర్ల ఫార్మా క్లస్టర్‌కు రోజుకు 4 లక్షల గ్యాలన్ల నీరు అవసరమని, అందుకోసమే కొడంగల్ లిఫ్ట్‌కు ప్రభుత్వం సిద్ధమైందని పాలమూరు రైతులు మండిపడుతున్నారు.
హైదరాబాద్, నవంబర్17 (నమస్తే తెలంగాణ): లగచర్ల ఫార్మా కోసం రైతుల ప్రయోజనాలను దెబ్బతీస్తున్నదంటూ ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంటున్న రేవంత్ సర్కార్ తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నది. భీమా ప్రాజెక్టు నీళ్లు ఆయకట్టుకు దక్కకుండా లగచర్ల ఫార్మా క్లస్టర్‌కు తరలించేందుకు చర్యలు చేపట్టిందని పాలమూరు రైతులు మండిపడుతు న్నారు. ఎలాంటి అనుమతులు లేకున్నా.. నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతలకు ప్రభుత్వం రూపకల్పన చేసింది. భీమా నుంచి ఏడాదికి 7 టీఎంసీల నీళ్లను తరలించేలా దీన్ని డిజైన్ చేసిందనే విమర్శలున్నాయి.
మొదటిదశ పనులను రెండు ప్యాకేజీలుగా విభజించి టెండర్లు ఖరారు చేసింది. మాగనూర్, మక్తల్, నర్వ, ఆత్మకూర్, చిన్నచింతకుంట, వనపర్తి, పెద్దమందడి, పెబ్బేరు, పాన్‌గల్, వీపనగండ్ల, కొల్లాపూర్, కొత్తకోట, దేవరకద్ర మండలాల రైతుల పంట భూములను ఎండబెట్టి, కృష్ణా జలాలు యథేచ్ఛగా మళ్లించుకొని కొడంగల్‌కు పట్టుకుపోయేందుకు కసరత్తు పూర్తి అయింది. ఈ మేరకు ఎన్‌కేఎల్‌ఐఎస్ రెండవ దశ ప్రాజెక్టు పనులకు డీపీఆర్ సిద్ధం చేయాలని అధికారుల మీద ఒత్తిడి తెస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది.
భీమా ఫేజ్-1, ఫేజ్-2 ఎత్తిపోతల పథకం కింద 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలని నిర్ణయించినా.. ఉమ్మడి రాష్ట్రంలో ప్రాజెక్టు పనులనే పూర్తి చేయలేదు. తెలంగాణ ఏర్పాటు అనంతరమే కేసీఆర్ భీమా ప్రాజెక్టును ఆధునీకరించి 1.98 లక్షల ఎకరాల ఆయకట్టును నిర్ధారించారు. జూరాల ప్రాజెక్టులో నిండుగా నిల్వ జలాలు ఉన్నప్పుడు మాత్రమే ఎగువ నుంచి వచ్చే వరద నీటిని సమాంతర కాల్వకు వదులుతారు. అంటే వానాకాలంలో మాత్రమే భీమా ఫేజ్-1, ఫేజ్-2 లిఫ్ట్‌లకు నీళ్లు అందుతాయి. ఎత్తిపోసిన నీళ్లతో శంకర సముద్రం, కృష్ణ సముద్రం, రంగ సముద్రం, ఎనుగొండ రిజర్వాయర్లను నింపి ఆయకట్టుకు వదులుతున్నారు.
కేసీఆర్ హయాంలో అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రాజెక్టు మీద ప్రత్యేక దృష్టి పెట్టి 1.58 లక్షల ఎకరాలకు నీళ్లు అందించగలిగారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఈ ప్రాజెక్టును పట్టించుకున్న వారే లేరు. భీమా లిఫ్ట్‌కు నీళ్లు అందించే జూరాల ప్రాజెక్టు క్రస్ట్‌గేట్ల లీకేజీలతో నిత్యం 100 నుంచి 150 క్యూసెక్కుల నీరు వృథాగా పోతోంది. దీంతో భీమా ఆయకట్టు మరింత తగ్గింది. గత యాసంగిలో భీమా ప్రాజెక్టు కింది ఆయకట్టుకు ప్రభుత్వం క్రాప్ హాలీడే ప్రకటించింది.
భీమా ప్రాజెక్టు కింద ఆయకట్టుదారుల వాస్తవ పరిస్థితి ఇట్లా ఉండగా.. కాల్వలను ఆధునీకరించటం వలన 7 టీఎంసీల జలాలు మిగులుతున్నాయని, ఈ మిగులు జలాలనే ఎన్‌కేఎల్‌ఐఎస్ ప్రాజెక్టుకు తరలిస్తున్నట్టు నీటిపారుదల అధికారుల చేత చెప్పిస్తూ రైతులను మోసం చేస్తున్నారు. కృష్ణా నదిలోని వరద నీళ్లను మాత్రమే తీసుకుంటామని చెప్పి గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు కట్టినట్టే.. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భీమా ప్రాజెక్టు ఆయకట్టుదారులను మోసం చేస్తూ ఎన్‌కేఎల్‌ఐఎస్ ప్రాజెక్టు కడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. భీమా ఫేజ్ 1 నీళ్లనే నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతలకు లింక్ చేస్తున్నారు. మొదటి దశలో రూ.1,134.62 కోట్లు ఖర్చు చేసి నీళ్లు భూత్పూరు జలాశయం వరకు తీసుకువస్తారు. మళ్లీ అక్కడి నుంచి నీళ్లను ఎత్తిపోసి కనుకుర్తి వరకు తీసుకుపోతారు. రెండో ప్యాకేజీలో రూ.1,126.23 కోట్లు వ్యయంతో ఊట్కూరు, కనుకుర్తి పంపింగ్ స్టేషన్ల నిర్మాణం చేపట్టనున్నారు. ఈ మేరకు టెండర్లు కూడా ఖరారు అయ్యాయి.
రెండవ దశలో దుద్యాల మండలంలోని లగచర్ల, హకీంపేట, పోలేపల్లి, రోటిబండతండా, పులిచర్లకుంటతండా పరిధుల్లో సుమారు 1,375 ఎకరాల్లో ఫార్మా విలేజ్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. అనుకున్నది అనుకున్నట్టు సాగితే.. తొలి దశలో 8 ఫార్మా కంపెనీల నిర్మాణానికి ప్రైవేటు యాజమాన్యం ముందుకొచ్చింది. ఇందులో మేజర్ ఫార్మా కంపెనీలు ముఖ్యనేత బంధువులకు చెందినవే అనే ప్రచారం ఉంది. ఇవి కాకుండా మరో 5-6 ఫార్మా కంపెనీలు మలి దశలో వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. పెద్ద ఫార్మా కంపెనీకి రోజుకు కనీసం 20 నుంచి 25 వేల గ్యాలన్ల నీళ్లు అవసరం పడుతాయని, ఈ లెక్కన 10-15 ఫార్మా కంపెనీలకు 3 నుంచి 4 లక్షల గ్యాలన్ల నీళ్లు అవసరపడుతాయని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు అంచనా వేస్తున్నారు.
ఫార్మా క్లస్టర్‌కు అవసరమైన నీళ్లు తోడుకోవటానికి వీలుగా దుగ్యాల మండలంలోని ఉస్నాబాద్ పెద్ద చెరువును ఆధునీకరించటానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ప్రస్తుతానికి 1000 ఎకరాలకు నీళ్లు అందించే సామర్థ్యం ఉన్న చెరువు పరిధిని విస్తృతంగా పెంచి, కనీసం 0.05 టీఎంసీల జలాలను నిల్వ చేసుకునే విధంగా ఆధునీకరించటానికి ప్రతిపాదనలు తయారు అయ్యాయి. భూసేకరణ ముగిసి,ఇండస్ట్రీల నిర్మాణం పూర్తై, ఉత్పత్తులు ప్రారంభించటానికి రెండున్నర నుంచి మూడేండ్లు పట్టే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. పరిశ్రమలు పని ప్రారంబించే నాటికి అవసరమైన జలాలు అందుబాటులో ఉంచే విధంగా ఎన్‌కేఎల్‌ఐఎస్ ప్రాజెక్టు పనులను ఇరిగేషన్ శాఖ ఇంజినీర్లు డిజైన్ చేసినట్టు సమాచారం.