BRS Meeting | హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): సునామీ అంటే ఎట్ల ఉంటదో మనం సముద్రంలో చూశాం.. కానీ, ఇప్పుడు జనసునామీ ఎట్ల ఉంటదో ఎల్కతుర్తిలో చూశాం. చీమలదండులా కదిలిన గులాబీ సైనికులు బీఆర్ఎస్ రజతోత్సవ సభకు జనజాతరలా కదిలివచ్చారు. కేసీఆర్ సభలంటేనే ఆషామాషీ కాదు.. పార్టీ రజతోత్సవ వేళ… దీంతోపాటు ఏడాది తర్వాత తమ నాయకుడు బహిరంగ సభకు వస్తారంటే గులాబీ కార్యకర్తలు, తెలంగాణవాదుల్లో ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. సభలు నిర్వహించడంలో దేశ రాజకీయ చరిత్రలో మరో రికార్డును కేసీఆర్ సృష్టించారు. ఎల్కతుర్తిలో ఆదివారం నిర్వహించిన సభ అత్యధిక ప్రజలు హాజరైన రాజకీయ సభగా రికార్డులకెక్కనుంది. గతంలో 2010లో వరంగల్‌లో నిర్వహించిన సభ కంటే ఈసారి ఎక్కువమంది హాజరైనట్టు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.
రాష్ట్రం నలువైపుల నుంచి పోటెత్తిన జనంతో హనుమకొండ, వరంగల్, కరీంనగర్, సిద్దిపేట వైపు ఉన్న రహదారులన్నీ ట్రాఫిక్‌జాంతో కిక్కిరిసిపోయాయి. లక్షలాది మంది పార్టీ కార్యకర్తలు, కేసీఆర్ అభిమానులు ట్రాఫిక్ జాంలో ఇరుక్కొని ఇక చేసేది లేక మొబైల్ ఫోన్లలోనే యూట్యూబ్, ఫేస్‌బుక్‌లలో తమ అభిమాన నేత ప్రసంగాన్ని చూడటం రోడ్ల పక్కన కనిపించింది. మధ్యాహ్నం ఒంటిగంటకే సభా వేదిక ముందువేసిన కుర్చీలన్నీ నిండిపోయాయి. ఇక మూడున్నరలోపే పార్కింగ్ ప్రాంతాలన్నీ కిక్కిరిసిపోయాయి. ప్రజలు భారీగా వచ్చేయడంతో వేదిక నిర్వాహకులు కేసీఆర్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో కేసీఆర్ కూడా తొలుత అనుకున్న సమయానికి ముందే బయల్దేరి సభకు వచ్చారు. వచ్చిన తర్వాత కొంత సేపు సభకు వచ్చిన ముఖ్యులతో భేటీ అయ్యారు. ఇంకా జనం ట్రాఫిక్‌లోనే చిక్కుకున్నారని వేదికపై నుంచి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రకటించారు. వేదిక వద్దకు వారు చేరుకోవడానికి సహకరించాలని పోలీసులను, వలంటీర్లను కోరారు.
జనసంద్రమే..
కేసీఆర్ వేదిక వద్దకు వచ్చే సమయానికే సభాస్థలి నిండిపోయింది. కేసీఆర్ రావడం చూసి ఒక్కసారిగా కేసీఆర్‌కు అనుకూలంగా నినాదాలు చేశారు. కిలోమీటర్ల దూరంలో ఉన్నవారు కూడా పరిగెత్తుకొని వచ్చారు. కేసీఆర్ ప్రసంగం మొదలుపెట్టే సమయానికి 1300 ఎకరాల సభాస్థలం కాలుపెట్టే సందులేకుండా జనంతో నిండిపోయింది. సభ ముగిసిన తర్వాత వేదిక వద్ద నుంచి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ముఖ్యనేతలు బయటకు వచ్చేందుకు గంటలకొద్ది సమయం పట్టింది. సభకు వచ్చిన వారు ప్రాంగణం నుంచి బయటకు వెళ్లేందుకు అర్ధరాత్రి వరకు గంటల సమయం వేచిఉండాల్సి వచ్చింది.
ఎన్నికలు లేవు.. ఉద్యమ సమయం కాదు..
సాధారణంగా ఎన్నికలప్పుడు సభలు పెట్టడం రాజకీయ పార్టీలకు రివాజు. ఆ సభలకు భారీ ఎత్తున జనసమీకరణ చేస్తుంటారు. కానీ, రాష్ట్రంలో ఇప్పుడు ఎలాంటి ఎన్నికలు లేవు. పైగా నడివేసవి. ఎండలు 40 డిగ్రీలను తాకుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కార్యకర్తలే కాకుండా ఇంత మంది జనం స్వచ్ఛందంగా కదిలిరావడం కేసీఆర్‌పై ఉన్న క్రేజ్‌కు, బీఆర్ఎస్ పార్టీపై ఉన్న అభిమానానికి నిదర్శనం. ఎన్నికలప్పుడు పార్టీ కార్యకర్తలను సమీకరించి సమావేశాలు పెడుతుంటారు. కానీ, ఈ సభకు ప్రజలు స్వచ్ఛందంగా కదిలివచ్చారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమం పట్ల ఉన్న నిబద్దత, ఆకర్షణ, సంఘీభావం తెలపాలన్న లక్ష్యంతో ప్రజలు ఎక్కడ సభలు పెట్టినా వచ్చేవారు. కానీ, ఇది ఉద్యమ సందర్భం కూడా కాదు. అయినా లక్షలాదిగా ప్రజలు తరలివచ్చారు.