నాంపల్లి, సెప్టెంబర్ 6: బీజేపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి పరాభవం ఎదురైంది. నల్లగొండ జిల్లా నాంపల్లి మండలంలోని తుంగపహాడ్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు మంగళవారం వెళ్తుండగా ఆయనను గ్రామస్థులు అడ్డుకొన్నారు. గ్రామంలో ఏం అభివృద్ధి చేశావని వస్తున్నావో చెప్పాలని నిలదీశారు. అసహనానికి గురైన రాజగోపాల్‌రెడ్డి.. ‘కుక్కలు మొరిగితే భయపడే వ్యక్తిని కాను’ అనడంతో గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘మా ఓట్లతో గెలిచి కాంట్రాక్టుల కోసం పార్టీ మారిన వ్యక్తివి నువ్వు’ అంటూ తిరగబడ్డారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కాగా, నాంపల్లిలో రాజగోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన బీజేపీ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి బీజేపీ సీనియర్ నాయకులు డుమ్మా కొట్టారు.
కార్యాలయం వద్ద ఏర్పాటుచేసిన బోర్డుపై పార్టీ జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్‌రెడ్డి ఫొటో పెట్టకపోవడం వివాదాస్పదమైంది. బీజేపీలో చేరిన వారినే మళ్లీ మళ్లీ చేర్చుకొంటున్నారని బీజేపీ తీరుపై ప్రజలు చర్చించుకొంటున్నారు. ఆగస్టు 24న హైదరాబాద్‌లో రాజగోపాల్‌రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరిన నాంపల్లి మండలం చిట్టెంపహాడ్ సర్పంచ్ అబ్బనబోయిన చంద్రమౌళి తాజాగా మంగళవారం చిట్టెంపహాడ్లో మళ్లీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సమక్షంలోనే బీజేపీ కండువా కప్పుకోవడంతో ప్రజలు విస్తుపోతున్నారు. ఒకే వ్యక్తి రెండుసార్లు పార్టీలో చేరడం.. అదికూడా రాజగోపాల్‌రెడ్డి సమక్షంలోనే జరుగడంతో నవ్వుకుంటున్నారు.