మెదక్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ ): మైక్ దొరికితే చాలు దంచికొట్టే మంత్రి వివేక్‌కు జనం నుంచి చుక్కెదురైంది. ఏదిపడితే అది మాట్లాడే ఆయన నోటి దురుసుతనానికి ప్రజలే సరైన సమాధానం చెప్పారు. తమ ప్రభుత్వ హయాంలో చెప్పుకునేందుకు చేసిన పనులే లేకపోవడంతో.. బీఆర్ఎస్ ప్రభుత్వంపై నిందలేసే కుటిలయత్నంపై తీవ్రస్థాయిలో నిరసన గళం వినిపించారు. మెదక్ జిల్లా నర్సాపూర్‌లో శనివారం వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన మంత్రి.. పట్టణంలోనే ఏర్పాటుచేసిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.8 లక్షల కోట్ల అప్పు చేసిందని, రూ.లక్ష కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తే పైసా ఉపయోగం లేకపోయినా ప్రతినెలా రూ.20 వేల కోట్ల మిత్తి కాంగ్రెస్ ప్రభు త్వం కడుతున్నదని ఆ సభలో మంత్రి వివేక్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ సమయంలోనే వేదికపైనే ఉన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డితోపాటు వేదిక కింద ఉన్న స్థానిక ప్రజల నుంచి మంత్రిపై తీవ్రస్థాయిలో ప్రశ్నల వర్షం కురిసింది.
‘రాష్ట్రంలో మీరు చేసి న అభివృద్ధ్ది, సంక్షేమం ఏదీ? మహిళలకు ఇ స్తామన్న రూ.2,500 ఎప్పుడిస్తారు? తులం బంగారం హామీ ఏమైంది? సాగు, తాగునీటి సమస్యలు ఎక్కడైనా తీర్చారా? ఇందిరమ్మ ఇండ్లు కాంగ్రెస్ కార్యకర్తలకే ఇస్తారా?’ అంటూ వివేక్‌పై ప్రజలు ప్రశ్నలు సంధించా రు. నాటి సీఎం కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వడం మీకు చేతకాదు కానీ, మంచి పనులెన్నో చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం పై నిందలు వేస్తారా? అంటూ మంత్రిని నిలదీశారు. గత ప్రభుత్వ నిర్వాకంతోనే ఆర్టీసీ కా ర్మికులు సమ్మెకు దిగారని, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అందరికీ ఇవ్వలేకపోయారని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నామని మంత్రి చెప్పారు. దీంతో అక్కడున్న ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి స్పందించి మంత్రి తప్పుగా మాట్లాడుతున్నారంటూ ఖండించారు. మహిళలకు ఇస్తామన్న రూ.2,500 ఎప్పుడిస్తారని ప్రశ్నించారు. తులం బంగారం హామీ ఏమైందని, ప్రొటోకా ల్ ఎందుకు పాటించడంలేదని ఎమ్మెల్యే సహా అక్కడికొచ్చిన ప్రజలు ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో కొద్దిసేపు మంత్రి, ఎమ్మెల్యే మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నది. బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు పోటాపోటీగా నినాదాలు చేశారు. రభస చేయొద్దని, కూర్చోవాలంటూ ఇరు పార్టీల నేతలను మంత్రి వివేక్, కలెక్టర్ ప్రతిమాసింగ్ వారించినా వినకుండా నినాదాలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయకుండా బీఆర్ఎస్పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే వేదికపైనే మంత్రిని నిలదీశారు.
కేసీఆర్‌పై నిందలు.. ప్రజల నిలదీతలు
కేసీఆర్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించినా, పేదలకు పంపిణీ చేయలేదని మంత్రి వివేక్ సభలో మాట్లాడుతూ ఆరోపించారు. దీంతో మరోసారి స్పందించిన ప్రజలు వేదికపైకి వెళ్లేందుకే ప్రయత్నించారు. కేసీఆర్ ప్రభుత్వం నర్సాపూర్‌లో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించినా.. కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ఇండ్లను పేదలకు ఎందుకు పంపిణీ చేయడం లేదని పలువురు ప్రశ్నించారు. ఇండ్లు పంపణీ చేయడం కూడా కాంగ్రెస్ సర్కార్‌కు చేతకావడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇందిరమ్మ ఇండ్ల పేరుతో ప్రజలకు ప్రభుత్వం మోసం చేస్తున్నదని మండిపడ్డారు. ఇందిరమ్మ ఇండ్లు కాంగ్రెస్ కార్యకర్తలకు ఇస్తున్నారని, అర్హులైన పేదలకు ఎక్కడ పంపిణీ చేస్తున్నారని ప్రశ్నించారు.
ప్రజల సమస్యలు తీర్చే దిక్కేలేదు
‘గ్రామాల్లో తాగునీటి సమస్య ఉన్నా పరిష్కారం చేయడం లేదు.. సాగునీటి సమస్య ఎక్కడ ఉన్నా తీర్చే దిక్కే లేదు.. కరెంట్ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించడమే లేదు.. ఆ కరెంట్ కూడా సక్రమంగా సరఫరా కాక పంటలు ఎండిపోతున్నాయి’ అని ఆ సభలో పాల్గొన్న పలువురు మంత్రి ఎదుట సమస్యలను ఏకరువు పెట్టారు. అర్హులైన పేదలకు పింఛన్లు ఎందుకు మంజూరు చేయడం లేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో నర్సాపూర్ అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించిందని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని నిధులు మంజూరు చేశారో చెప్పాలని ప్రజలు మంత్రిని ప్రశ్నించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యను బీఆర్ఎస్ ప్రభుత్వం పరిష్కారం చేయలేదనే మంత్రి వ్యాఖ్యలపైనా స్థానికుల నుంచి ఆగ్రహం వ్యక్తమైంది. అధికారం కాంగ్రెస్‌దా? బీఆర్ఎస్దా? అని మంత్రిని ప్రశ్నించారు. కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంతో ఆర్టీసీ కార్మికులు స్మమెకు దిగారని, ఒక కార్మికుడు మృతి చెందాడని ఆరోపించారు. ప్రజల సమస్యలను పరిష్కరించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నదని మండిపడ్డారు. ఇదే సమయంలో వేదికపై మంత్రి వివేక్‌కు, ఎమ్మెల్యే సునీతారెడ్డి మధ్య మాటల యుద్ధం జరిగింది. ప్రజల నుంచి, స్థానిక ఎమ్మెల్యే నుంచి ప్రశ్నల వర్షం కురవడంతో ఎటూ తోచని మంత్రి కార్యక్రమం మధ్యలోనే వెళ్లిపోవడం గమనార్హం. ఆరు గ్యారెంటీలపై సర్కార్‌ను నిలదీస్తాం
నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి
నర్సాపూర్, ఏప్రిల్ 25: ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలను అమలు చేసేదాకా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామని మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి స్పష్టంచేశారు. నర్సాపూర్‌లో శనివారం కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ సందర్భంగా జరిగిన రసాభాసపై ఆమె స్పందించారు. బీఆర్ఎస్ పాలనలో అప్పటి సీఎం కేసీఆర్ అన్నిరంగాల్లో తెలంగాణను దేశంలో నంబర్‌వన్ స్థానంలో నిలిపితే, కాంగ్రెస్ పాలనలో దేశంలోనే చివరి స్థానంలోకి దిగజారిందని తెలిపారు. కాంగ్రెన్ నేతలు కేసీఆర్ కాలు గోటికి కూడా సరిపోరని చెప్పారు. తొమ్మిదిన్నరేండ్లలో పార్టీలకు అతీతంగా అన్నివర్గాల వారికి కేసీఆర్ న్యాయం చేశారని, ఎన్నో పథకాలు అమలు చేశారని గుర్తుచేశారు. కాంగ్రెస్ హయాంలో ఎమ్మెల్యే కోటా కింద 1,400 ఇండ్లు ఇవ్వాల్సి ఉండగా, కేవలం 400 ఇండ్లు మంజూరు చేశారని, అవి కూడా ఇవ్వడానికి 100 సార్లు తిప్పిచ్చుకున్నారని విమర్శించారు. ఆ ఇండ్లు ఇవ్వకుండా రాజకీయ కుట్రలతో ఆపాలని చూశారని విమర్శించారు. రాష్ట్రంలోని మహిళలకు కాంగ్రెస్ ఇస్తానన్న రూ.2,500 కోసం ఎదురుచూస్తున్నారని, తులం బంగారం ఎందుకివ్వడం లేదని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ హయాంలో రూ.8లక్షల కోట్ల అప్పులు అయ్యాయని కాంగ్రెస్ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని, కేవలం రూ.3.46 లక్షల కోట్ల అప్పు మాత్రమే అయ్యిందని తేల్చిచెప్పారు. ఇదే విషయాన్ని పదేపదే కేటీఆర్, హరీశ్‌రావు చెప్తున్నా, కాంగ్రెస్ నాయకులు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. హామీలు ఇచ్చేటప్పుడు రాష్టంలో అప్పులున్నాయని కాంగ్రెస్ నేతలకు తెలియదా? అని ఆమె ప్రశ్నించారు. జిల్లా ఇన్చార్జి మంత్రిని తాము గౌరవిస్తామని, కానీ, అధికారిక కార్యక్రమాన్ని కాంగ్రెస్ కార్యక్రమంలా ఎలా మారుస్తారని ప్రశ్నించారు. రౌడీలు, గుండాల్లా కాంగ్రెస్ నాయకులు వ్యవహరించి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని విఫలం చేశారని విమర్శించారు. నర్సాపూర్‌లో డీఎస్పీ ఆఫీసే లేదని, ఆర్డీవో, తహసీల్ ఆఫీసులకు పక్కాభవనాలు లేవని చెప్పారు. నిర్మాణం పూర్తి చేసుకున్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పంపిణీ చేయకపోవడంతో అసాంఘిక కార్యకలాపాలకు అవి అడ్డాగా మారాయని తెలిపారు. సమావేశంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు చంద్రాగౌడ్, చంద్రశేఖర్, మన్సూర్, రామాగౌడ్, బాల్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.