Harish Rao | చైనా మాంజా పట్ల ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు కోరారు. సంక్రాంతి పండుగ సమయంలో చైనా మాంజా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. సిద్దిపేటలో నిర్వహించిన సంక్రాంతి సంబురాల్లో హరీశ్‌రావు పాల్గొన్నారు. స్థానికులతో కలిసి పతంగులు ఎగురవేసి, రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ.. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే పుణ్య కాలమే సంక్రాంతి అని తెలిపారు. కొత్త ఏడాదిలో అడుగుపెట్టగానే వచ్చే తొలి పండగ సంక్రాంతి అని పేర్కొన్నారు. రైతులు పండించిన దాన్యం ఇంటికి చేరుతుంది కాబట్టి ఇది రైతుల పండుగ.. అన్నదాతల పండుగ అని అన్నారు. సాగులో సాయపడిన ఆవులు, ఎడ్లను సిరులు కురిపించే లక్ష్మి దేవితో సమానంగా పూజించే గొప్ప సంకృతి మనది అని తెలిపారు. మన పండుగల సమయంలో పాటించే ప్రతి ఆచారం వెనక ప్రత్యేక నమ్మకం, చరిత్ర ఉంటాయి. సైన్స్ ఉంటుందని చెప్పారు. అలాగే సంక్రాంతి పండుగ పూట ఎగురవేసే గాలిపటాల వెనుక కూడా సైన్స్ ఉందన్నారు. సంక్రాంతి పండుగ శీతాకాలంలో రావడం వల్ల చలి ఎక్కువగా ఉంటుందని.. ఈ సమయంలో ఎండలో గాలిపటాలు ఎగురవేయడం వల్ల శరీరానికి విటమిన్ డి లభిస్తుందని అన్నారు. ఇది ఎముకలను బలంగా ఉంచడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి చాలా అవసరమని వివరించారు. అలాగే గాలిపటం ఎగురవేస్తున్నప్పుడు చేతులు, భుజాలు, వీపు కండరాలు కదులుతుంటాయని.. దారాన్ని పట్టుకుని.. గాలిపటాన్ని నియంత్రించడం వల్ల.. చేతుల్లో పట్టు, బలం పెరుగుతుందని చెప్పారు. అలాగే కండరాలు బలపడతాయి. ఇది ఒక మంచి వ్యాయామం లాంటిదని పెద్దలు అంటారని అన్నారు. ఇట్లా మన మనం జరుపుకునే ప్రతి పండుగ ఒక సంప్రదాయం, ఆ సాంప్రదాయం వెనుక సైన్స్, మన ఆరోగ్యం ఉంటుందని పేర్కొన్నారు.
మనం జరుపుకునే పండుగ జీవితాంతం గుర్తుండిపోయే సంబురాన్ని ఇవ్వాలి గాని విషాదాన్ని ఇవ్వకూడదని.. కుటుంబాల్లో చీకటిని నింపకూడదని హరీశ్‌రావు అన్నారు. గాలి పటాలు ఎగిరేస్తూ బిల్డింగ్ నుంచి పడిపోయారు అన్న వార్తలు చూస్తుంటామని.. పిల్లలు, పెద్దలు జాగ్రత్తగా గాలి పటాలు ఎగురేయాలని, సంబరంగా పండగ జరుపుకోవాలని కోరుతున్నానని ఆకాంక్షించారు. వ్యాపార దృక్పథంతో ప్రవేశించిన చైనా మాంజా మన పండుగను కలుషితం చేస్తోందని అన్నారు. చైనా మాంజా కాదు అది కిల్లర్ మాంజా.. అని వ్యాఖ్యానించారు. ఇది నిషేధితం అయినా, అక్రమంగా విక్రయిస్తున్నారని తెలిపారు. దీనివల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు, ఆసుపత్రి పాలవుతున్నారని తెలిపారు.
సంగారెడ్డి జిల్లాలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన వలస కూలీ అవిదేశ్ మెడకు చైనా మాంజా చుట్టుకుని బుధవారం మృతి చెందాడని హరీశ్‌రావు తెలిపారు. ఉప్పల్ స్టేషన్ పరిధిలో చైనా మాంజా తగలడంతో ఏఎస్సై నాగరాజు గొంతు కోసుకుపోయి.. ఆసుపత్రి పాలయ్యాడని పేర్కొన్నారు. ఇటీవలి రోజుల్లో హైదరాబాద్‌లో డాక్టర్లు, సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, సాధారణ ప్రజలు గాయపడ్డారని తెలిపారు. పక్షులు, జంతువులు కూడా ప్రాణాలు కోల్పోతున్నాయని పేర్కొన్నారు. ఎవరో చేసిన తప్పుకు, కుటుంబ సభ్యులు శోకాన్ని అనుభవిస్తున్నారని తెలిపారు. ఈ కిల్లర్ చైనా మాంజా పై మనందరం బాధ్యతగా వ్యవహరించాలని,. ఎక్కడ ఉన్నా పోలీసులకి స.మాచారం అందించాలని సూచించారు. ప్రభుత్వం ఈ విషయంలో ఉక్కుపాదం మోపాలని.. రాష్ట్రానికి చైనా మాంజా రాకుండా పోలీసులు అడ్డుకోవాలన్నారు.
సంక్రాంతి వేళ పతంగులు ఆకాశంలో ఎత్తుకు ఎగిరినట్లు మీరు జీవితాల్లో ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నా అని హరీశ్‌రావు అన్నారు. ఎంత ఎత్తుకు ఎదిగినా గాలిపటానికి దారం ఆధారం.
ఆ దారం తెగిన గాలిపటం ఏ దారిన వెళ్లాలో తెలియక, గాలిలో నిలబడలేక కుప్పకూలిపోతుందని అన్నారు. అలాగే మనం ఎంత ఎత్తుకు ఎదిగినా మనకు ఆధారంగా ఉన్న మన కుటుంబం, మన స్నేహితులు, మన సమాజాన్ని మరచిపోవద్దని సూచించారు. చెరకులోని తీయదనం మీ మాటల్లోనూ, పాలలోని తెల్లదనం మీ మనసులోనూ, పతంగుల రంగులు మీ కలల్లోనూ నిండిపోవాలనీ.. నూతన సంవత్సరంలో రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ..మరొక్కసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.