CM Revanth Reddy | మద్దూరు, మార్చి 13: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ నియోజకవర్గంలో తాగునీటి కోసం ప్రజలు తండ్లాడుతున్నారు. కొద్దికాలంగా సమస్య వేధిస్తున్నప్పటికీ పది రోజులుగా మరింత తీవ్రం కావడంతో మద్దూరు మండలం దోరేపల్లివాసులు ధర్నా చేపట్టారు. 985 ఇండ్లు, 5 వేల జనాభా ఉన్న సీఎం రేవంత్రెడ్డి సొంత ఇలాకా పల్లెలోనే నీటి కోసం ప్రజలు అరిగోస పడుతున్నారు. ఇలాగైతే లాభం లేదని బుధవారం గ్రామస్థులు రోడ్డెక్కి నిరసన చేపట్టారు. మద్దూరు-కోస్గి ప్రధాన రహదారిపైకి చేరుకుని ఖాళీ బిందెలతో బైఠాయించారు. నీటి కోసం అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకుం డా పోయిందని వాపోయారు.
పరిస్థితి ఇప్పుడే ఇలా ఉంటే మున్ముందు ఇంకె లా ఉంటుందోనని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామానికి తాగునీరు సరఫరా చేసే మిషన్ భగీరథ పైప్లైన్ పది రోజుల క్రితం పగిలిపోయింది. పట్టించుకునే నాథుడే లేకపోవడంతో గ్రామానికి నీటి సరఫరా బంద్ అయింది. గుక్కెడు నీటి కోసం అల్లాడుతున్నా, అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోకపోవడం తో చివరికి రోడ్డెక్కి నిరసనకు దిగారు. కేసీఆర్ హయాంలో తామెప్పుడూ ఇలా రోడ్డెక్కలేదని గుర్తుచేసుకున్నారు. కాం గ్రెస్ అధికారంలోకి వచ్చిన వంద రోజులకే తాగునీటి కోసం నిరసన చేయాల్సిన దుస్థితి దాపురించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు, అధికారుల జోక్యంతో చివరికి గ్రామస్థులు ఆందోళన విరమించారు.