హైదరాబాద్, మార్చి 27 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో కొనసాగుతున్నది ప్రజా పాలన కాదని, ప్రజల ఆశల అవహేళన అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హామీలన్నీ అటకెక్కించి, ప్రజాసంపదను కొల్లగొడుతున్నారని ఆరోపించారు. పదేండ్ల కేసీఆర్ పాలనలో రూ. 28,817 కోట్లు రుణమాఫీ చేశామని, 11 విడుతల్లో రూ. 73 వేల కోట్లు రైతుబంధు ఇచ్చామని, 1.11 లక్షల మంది రైతు కుటుంబాలకు రూ. 5లక్షల చొప్పున బీమా అందజేశామని తెలిపారు.
రేవంత్‌రెడ్డి మాత్రం ‘నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు’ అన్న చందంగా రైతులకు 3 గంటల కరెంట్ చాలు అని, 10 హెచ్‌పీ మోటర్ పెడితే గంటలో ఎకరాకు నీరందిచ్చవచ్చని మాట్లాడారని గుర్తుచేశారు. కేసీఆర్‌పై దుష్ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు మెరుగైన పాలన అందించడంలో విఫలమవుతున్నదని విమర్శించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, తగిన సమయంలో రేవంత్ సర్కారుకు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.