హైదరాబాద్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ): నూతన సచివాలయం డోమ్‌లను కూల్చేస్తామంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై ప్రజలు, నెటిజన్లు మండిపడుతున్నారు. రాష్ట్ర ప్రభు త్వం ప్రతిష్ఠాత్మకంగా, చరిత్రలో నిలిచిపోయేలా సచివాలయం నిర్మిస్తుంటే కండ్లమంట ఎందుకంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ భవనం రాష్ట్ర పాలనా సౌధంగా మాత్రమే కాకుండా, ఒక ఐకానిక్ బిల్డింగ్‌గా చరిత్రలో నిలిచిపోతుందని అంటున్నారు. రాష్ట్ర ప్రతిష్ఠకు చిహ్నంగా నిలిచే కట్టడం పట్ల ఇష్టం వచ్చినట్టు మాట్లాడటంపై ప్రజలు మండిపడుతున్నారు. సచివాలయ డోమ్‌లు కూల్చివేస్తామని ప్రగల్భాలు పలుకుతున్న బండి సంజయ్.. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ చారిత్రక కట్టడాలపై ఉన్న డోమ్ ఆకారాలను కూడా కూల్చేస్తారా? అంటూ నిలదీస్తున్నారు. సుప్రీంకోర్టుపై, మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ అసెంబ్లీపైనా డోమ్‌లు ఉన్నాయని, మరి వాటిని కూల్చేస్తారా అని ప్రశ్నిస్తున్నారు. కర్ణాటక అసెంబ్లీపై, మైసూర్ ప్యాలెస్ వంటి చారిత్రక నిర్మాణాలపైనా డోమ్ ఆకారాలు ఉన్నాయని, వాటిని తొలగిస్తుందా? అన్నది స్పష్టం చేయాలని అంటున్నారు.
ఒక పోలీస్.. టోపీ పెట్టుకొంటేనే గౌరవం. ఆ టోపీలో హుందాతనం కనిపిస్తుంది. తెలంగాణ సచివాలయ నూతన భవనంపై కట్టిన గుమ్మటం కూడా అలాంటిదే. రాష్ట్ర పాలనకు హుందాతనం తెచ్చే ప్రతీక అది. కేవలం గుండ్రంగా కట్టిన కట్టడం కాదది. జాతీయ చిహ్నాన్ని పొదిగిన వేదిక అది. రాజ్యాంగబద్ధుడినై ఉంటానని మనకు మనమే చెప్పుకొనే సంకల్పానికి సంకేతం అది. దాన్ని చూస్తేనే భారత పౌరుడినన్న గర్వం తొణికిసలాడుతుంది. భారతీయుడి ఆత్మాభిమానానికి ఆనవాలు అన్న ఆలోచన మెదులుతుంది. అంతటి గొప్ప కట్టడాన్ని కూల్చివేస్తానని ఒక ప్రజాప్రతినిధే మాట్లాడటం ఎంత వరకు సబబు?
ఒకరేమో బాంబులతో ప్రగతిభవన్‌ను పేల్చేస్తామంటారు. ఇంకొకరు సెక్రటేరియట్ గుమ్మటాలను కూల్చేస్తామంటారు. వీరిద్దరూ ప్రధాన పార్టీలకు అధ్యక్షులుగా ఉండి, నోటికొచ్చినట్టు మాట్లాడటం సరికాదు. కేవలం మీడియాలో ప్రచారం కోసమే మాట్లాడు తున్నారు. బండి సంజయ్, రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను వారి సొంత పార్టీ నేతలే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సీఎం కేసీఆర్ నిర్మిస్తే, ప్రతిపక్ష నేతలు కూల్చేస్తామని అనడం ఎంతవరకు సమంజసం.
-పెద్ది సుదర్శన్‌రెడ్డి, నర్సంపేట ఎమ్మెల్యే
ఒకడు పేల్చేస్తా అంటడు. మరొకడు కూల్చేస్తా అం టడు. కాంగ్రెస్ పా ర్టీ గాంధీయిజం.. గాడ్సే విధానమైం దా? రేవంత్‌రెడ్డి అడుగుపెట్టడంతోనే పీసీసీ కాస్త ప్రదేశ్ క్రిమినల్ సెంటర్‌గా మారింది. కొత్త సెక్రటేరియట్ మీద గుమ్మటాలు కూల్చేస్తానంటున్న బండి సంజయ్.. నీకు దమ్ముంటే ముందు బీజేపీ పాలిత రాష్ర్టాల్లోని పాలనా భవనాలపై గుమ్మటాలు కూల్చెయ్. అభివృద్ధిని చూసి ఓర్వలేక కండ్లలో నిప్పులు పోసుకొంటున్నారు. ఒళ్లు దగ్గరపెట్టుకొని మాట్లాడకపోతే ప్రజలే మీ నాలుక కోస్తారు.
– ఆశన్నగారి జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే