హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ సర్కారు తమ డిమాండ్లను పట్టించుకోకపోవడం, సమస్యలు పరిష్కారం కాకపోవడంతో పెన్షనర్ల జేఏసీ నేతలు వ్యూహాత్మక ఆలోచన చేశారు. తాము ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినా.. ప్రభుత్వంలో చలనం లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్‌ను కలిసి తమ గోడును వెళ్లబోసుకోవాలని నిర్ణయించారు.
ఈ మేరకు శనివారం పెన్షనర్ల జేఏసీ కోర్‌కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ లక్ష్మయ్య మాట్లాడుతూ.. పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని మీనాక్షి నటరాజన్‌కు వాట్సాప్ ద్వారా విన్నవించామని తెలిపారు. తమ డిమాండ్ల సాధనకు ప్రత్యక్ష ఆందోళనకు సైతం సిద్ధమవుతున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో జేఏసీ సెక్రటరీ జనరల్ తులసి సత్యనారాయణ, శుభాకర్‌రావు, సూర్యనారాయణ, భరత్‌రెడ్డి, పుల్లయ్య, టీ వివేక్, తదితరులు పాల్గొన్నారు.