నమస్తే తెలంగాణ నెట్వర్క్, మార్చి 25 : కేంద్ర ప్రభుత్వంపై పెన్షనర్లు కన్నెర్రజేశారు. మూడు దశాబ్దాలపాటు ప్రభుత్వాలకు, ప్రజలకు మధ్య వారధిగా పనిచేసి సేవలందించిన తమ జీవితాలతో చెలగాటం ఆడటం సరికాదని మండిపడ్డారు. పెన్షనర్లను వర్గాలుగా విభజించి, వారికందించే ప్రయోజనాల్లో కోత పెట్టేందుకు రూపొందించిన పెన్షన్ వాలిడేషన్ యాక్టును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా తలపెట్టిన నిరసనల్లో భాగంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కలెక్టరేట్లు, తహసీల్దార్ కార్యాలయాల వద్ద బుధవారం పెన్షనర్లు, రిటైర్డ్ ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టారు. నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట పెన్షనర్లు నల్లబ్యాడ్జీలు ధరిం చి బైఠాయించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లావ్యాప్తంగా తహసీల్దార్ కార్యాలయాల ఎదుట రిటైర్డు ఉద్యోగులు ధర్నాలు చేపట్టారు. కామారెడ్డి కలెక్టరేట్‌తోపాటు నిజామాబాద్ జిల్లా బోధన్‌లోని సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం ప్రధాని నరేంద్రమోదీని ఉద్దేశిస్తూ రాసిన వినతిపత్రాన్ని సంబంధిత కార్యాలయాల్లో సమర్పించారు. పెన్షన్ వ్యాలిడేషన్ యాక్ట్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించారు. నల్లబ్యాడ్జీలు ధరించిన పెన్షనర్లు హనుమకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు కలెక్టరేట్ల వద్ద ధర్నా నిర్వహించారు.