Asara Pesion | కొడుకుల ఇంటి పన్ను కింద వృద్ధుల పింఛన్ సొమ్ము జమ.. మంచిర్యాల జిల్లాలో వింతలు
పింఛన్ సొమ్మును రెండింతలు పెంచుతరని ఆసరా పింఛన్ లబ్ధిదారులు ఓటేస్తే అసలే పెంచకపోగా, వచ్చే పింఛన్ సొమ్మును ఇంటి పన్ను కింద జమ చేసుకుంటూ పంచాయతీ అధికారులు దౌర్జన్యానికి దిగుతున్నారు. కొడుకుల ఇంటి పన్ను కింద వృద్ధుల పింఛన్ సొమ్మును పంచాయతీకి డైవర్ట్ చేసుకుంటున్నారు.
- పింఛన్ సొమ్ము.. పన్నుకు చెల్లు!
- వచ్చిన పెన్షన్ ఇంటిపన్ను కింద జమ
- ట్యాక్స్ కడితేనే స్కీములకు దరఖాస్తట
- మంచిర్యాల జిల్లా నంనూర్‌లో వింతలు
- ఆందోళన చెందుతున్న వృద్ధులు, పేదలు
- సర్కారు తీరు దుర్మార్గం: హరీశ్‌రావు
Asara Pesion | హాజీపూర్, జనవరి 23 : పింఛన్ సొమ్మును రెండింతలు పెంచుతరని ఆసరా పింఛన్ లబ్ధిదారులు ఓటేస్తే అసలే పెంచకపోగా, వచ్చే పింఛన్ సొమ్మును ఇంటి పన్ను కింద జమ చేసుకుంటూ పంచాయతీ అధికారులు దౌర్జన్యానికి దిగుతున్నారు. కొడుకుల ఇంటి పన్ను కింద వృద్ధుల పింఛన్ సొమ్మును పంచాయతీకి డైవర్ట్ చేసుకుంటున్నారు. ఇలా సుమారు 15 మంది వృద్ధుల పింఛన్ సొమ్మును ఇంటి పన్ను కింద జమ చేసుకోవడంపై వృద్ధులైన లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. మంచిర్యాల జిల్లా హజీపూర్ మండలం నంనూర్ గ్రామ పంచాయతీ అధికారులు వింతైన నిబంధనల పేరిట ఆసరా లబ్ధిదారులను, ఇతర గ్రామస్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ‘ఇంటిపన్ను బకాయిలు చెల్లిస్తేనే రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు దరఖాస్తులు తీసుకుంటాం. ఇంటి పన్ను పెండింగ్ ఉందా? ముందు క్లియర్ చేసి రండి. నీ కొడుకు ఇంటి పన్ను కట్టలేదు. అందుకే నీకు రావాల్సిన పింఛన్ ఇంటిపన్ను కింద జమ చేసుకున్నాం. ఇదిగో రసీదు తీసుకొని పో’ అంటూ ఆసరా పింఛన్ లబ్ధిదారుల చేతిలో పెడుతూ ఉత్త చేతులతో పంపుతున్నారు. పథకాలకు పన్నులకు ముడిపెట్టడం ఏమిటని.. పన్ను చెల్లించకపోతే తమకు రావాల్సిన పింఛన్ సొమ్మును జమ చేసుకునే అధికారం అధికారులకు ఎక్కడిది? అని వృద్ధులు ప్రశ్నిస్తున్నారు.
గ్రామంలో ఆరా తీసిన డీఆర్డీవో
నంనూర్ గ్రామ పంచాయతీ పింఛన్ విషయంపై జిల్లా అధికారులు స్పందించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు డీఆర్డీవో కిషన్ గురువారం నంనూర్ గ్రామానికి వచ్చి ఆరా తీశారు. ఇంటిపన్ను కట్టనందుకు పింఛన్ జమ చేసుకున్నట్టు తెలుసుకొని స్థానిక అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. పన్ను కట్టలేదని పింఛన్ సొమ్ము జమ చేసుకోవడం నిబంధనలకు విరుద్ధమని అనంతరం మీడియాతో డీఆర్డీవో చెప్పారు. కొందరు పన్ను కింద పింఛన్ జమ చేసుకోవాలని స్వచ్ఛందంగా చెప్పారని తెలిపారు. గ్రామంలో తొమ్మిది మందికి ఇలా పింఛన్ ఆపినట్టు తెలిసిందని, ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకుంటామని డీఆర్డీవో కిషన్ హామీ ఇచ్చారు.
ఐదొందలడిగినా ఇయ్యలే
ఇంటి పన్ను రూ.6 వేలు కట్టాలె. నా భర్త, ఇద్దరు కొడుకులు చనిపోయిన్రు. కూలిపనులు చేసుకొని బతుకుతున్న. ఇంటిపన్ను కోసం నా పింఛన్ డబ్బులు ఆపిన్రు. పండుగ ఉన్నది.. నా బిడ్డ వచ్చింది.. కనీసం ఐదొందలైనా ఇవ్వండి అని కారోబార్‌ను అడిగినా ఇయ్యలేదు. ఎంత బతిమిలాడినా పట్టించుకోలే.
– డొకె చుక్కమ్మ, నంనూర్
రెండు నెలల నుంచి తీసుకున్నరు
నా ఇంటి పన్ను రూ.6 వేలు ఉంది. పింఛన్ తీసుకోగానే రూ.వెయ్యి ఇంటి పన్ను కింద జమ చేసుకున్నరు. నా దగ్గర రెండు నెలలుగా రూ.వెయ్యి చొప్పున తీసుకున్నరు. రసీదు ఇయ్యమంటే మొత్తం ముట్టినంకనే ఇస్తమని కారోబార్ చెప్పిండు. ఇంత అన్యాలమా? ఇది పద్ధతి కాదు.
– చౌటకారి చంద్రయ్య, నంనూర్
ప్రభుత్వ తీరు దుర్మార్గం..

హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ): ఇంటి పన్ను బకాయిలున్నాయని చెప్పి వాటి కింద వృద్ధాప్య పింఛన్లు గుంజుకుంటరా? అని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. కొడుకు ఇంటి పన్ను కట్టకుంటే తల్లికి వచ్చే వృద్ధాప్య పింఛన్ లాక్కుంటరా? ఇట్ల ఎక్కడైనా ఉన్నదా? అని మండిపడ్డారు. ప్రభుత్వం అత్యంత దుర్మార్గమైన చర్యలకు పాల్పడుతూ అమానుషంగా వ్యవహరిస్తున్నదని ధ్వజమెత్తారు. ప్రభుత్వ నిర్ణయాలు, అధికారుల తీరు కుటుంబ సభ్యుల మధ్య చిచ్చు పెట్టేలా ఉన్నాయని నిప్పులు చెరిగారు. పింఛన్ డబ్బులను కూడా ఇంటి పన్ను కింద జమ చేసుకుంటే, ఆ వృద్ధుల బతుకు బండి నడిచేది ఎట్ల? అధికారంలోకి వస్తే ప్రతి నెలా రూ.4 వేలు పింఛన్ ఇస్తామని చెప్పి, ఇప్పుడు వచ్చే రూ. 2 వేల పింఛన్‌ను గుంజుకోవడం ఏమిటి అని నిలదీశారు. ఓవైపు లబ్ధిదారుల్లో కోత విధిస్తూ, మరోవైపు చేతికందిన పింఛన్‌ను ఇంటి పన్ను బకాయికి జమ చేయడం శోచనీయమని, మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం నంనూరు పంచాయతీ పరిధిలో 15 మంది వృద్ధులకు వెంటనే పింఛన్లు చెల్లించాలని, ఇంటిపన్ను ఇతర కారణాలు చెప్పి పింఛన్లు ఆపకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

