హైదరాబాద్, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ఔట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శుల (ఓపీఎస్) పదినెలల పెండింగ్ వేతనాలను తక్షణమే చెల్లించాలని తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల అసోసియేషన్ (టీఎస్పీఏ) రాష్ట్ర అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలను 1,2,3,4 గ్రేడ్లుగా పునర్వ్యవస్థీకరణ జరిపి.. అర్హులైన వారికి ప్రమోషన్లు ఇవ్వాలని కోరారు.
శనివారం ఖైరతాబాద్‌లోని రంగారెడ్డి జెడ్పీ కార్యాలయంలో నిర్వహించిన టీఎస్పీఏ సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంచాయతీ కార్యదర్శుల నియామకాల్లో ఔట్సోర్సింగ్ విధానం రద్దుచేసి.. 1,039 మంది ఓపీఎస్లను జూనియర్ పంచాయతీ కార్యదర్శులుగా రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు.