హిమాయత్‌నగర్, నవంబర్ 21 : రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్న భోజన పథకంలో పనిచేసే వంట కార్మికుల పెండింగ్ వేతనాలు, కోడిగుడ్ల బిల్లులను తక్షణమే మంజూరు చేయాలని అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్ కరుణకుమారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం హిమాయత్‌నగర్‌లోని ఎస్ఎన్ రెడ్డి భవన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు మధ్యాహ్న భోజన కార్మికులకు ఇచ్చిన హామీ మేరకు రూ.10 వేల వేతనం ఇవ్వాలని, ఈ పథకాన్ని ప్రైవేట్ సంస్థలకు అప్పగించే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని కోరారు. వంట కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ.. ఈ నెల 24న చిక్కడపల్లిలోని లేబర్ కమిషనర్ కార్యాలయం వద్ద నిర్వహించనున్న ధర్నాకు కార్మికులు పెద్దసంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.