హైదరాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం మాటలకే పరిమితమైందని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మణికంఠరెడ్డి, ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ విమర్శించారు. పెండింగ్లోని ఫీజు రీయింబర్స్మెంట్, సాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పదిరోజుల్లో ప్రభుత్వం ఫీజు బకాయిలను విడుదల చేయకపోతే ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే, మంత్రుల ఇండ్లు ముట్టడిస్తామని హెచ్చరించారు. శుక్రవారం ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో వారు మాట్లాడుతూ..
రాష్ట్రంలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను సకాలంలో విడుదల చేయకుండా వారి జీవితాలతో చెలగాటమాడుతున్నదని మండిపడ్డారు. మూడేండ్ల బకాయిలు దాదాపు 6వేల కోట్లకుపైగా పెండింగ్లో ఉన్నాయని పేర్కొన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ విడుదలకాక సర్టిఫికెట్ల కోసం విద్యార్థులు నానా అగచాట్లు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పెండింగ్ బకాయిలను విడుదల చేస్తామని హామీ ఇచ్చి 18నెలలు పూర్తి అవుతున్నా.. బకాయిలు విడుదల చేయడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. అద్దె భవనాల్లోని గురుకులాలకు అద్దెలు చెల్లించలేని స్థితిలో రేవంత్ సర్కారు ఉన్నదని ఎద్దేవా చేశారు.