రవీంద్రభారతి, అక్టోబర్ 7: రా్రష్ట్ర ప్రభుత్వం దసరా పండుగలోపే తాజా మాజీ సర్పంచ్‌లకు రావాల్సిన పెండింగ్ బిల్లులు చెల్లించాలని, లేకుంటే ప్రభుత్వంపై పోరాటం చేస్తామని తెలంగాణ సర్పంచ్ల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్ డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో గెలిచిన సర్పంచ్లమనే సాకుతో కక్షగట్టి పెండింగ్ బిల్లులు ఇవ్వడంలేదని ఆరోపించారు. సోమవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సుర్వి యాదయ్యగౌడ్ మాట్లాడుతూ తాజా మాజీ సర్పంచ్‌లు వడ్డీలకు డబ్బులు తెచ్చి గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసి అనేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని, కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారని చెప్పారు.
కాంగ్రెస్ ప్రభుత్వం 10 నెలలు గడుస్తున్నా పెండింగ్ బిల్లులు చెల్లించడంలేదని, దసరా పండుగ తరువాత 15 తేదీన సర్పంచ్ల సంఘం ముఖ్యనాయకులతో సమావేశమై ప్రభుత్వంపై ఆందోళనలు, నిరసనలు చేపడుతామని వెల్లడించారు. కార్యక్రమంలో సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ ఉపాధ్యక్షుడు గుంటి మధుసూదన్‌రెడ్డి, మాట్ల మధు, రాంపాక నాగయ్య, సుభాష్‌గౌడ్, మెడబోయిన గణేశ్ తదితరులు పాల్గొన్నారు.