హైదరాబాద్, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ) : గ్రామీణాభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరవేసే క్రమంలో వాహనాల కొరతతో ఎంపీడీవోలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు మండల పరిషత్ అభివృద్ధి అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షురా లు జొన్నల పద్మావతి తెలిపారు. ఆదివారం టీజీవో భవన్లో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఎంపీడీవోలకు వాహన సదుపాయం లేక మండలాల్లో చాలా పను లు ఆగిపోతున్నట్టు పేర్కొన్నారు. ఎంపీడీవోలకు వాహనాలు మంజూరుచేయాలని, వాహనాల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు.
అర్హులైన ఎంపీడీవోలకు డిప్యూటీ డీఎంవోలుగా పదోన్నతులు కల్పించాలని కోరారు. సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికలు ఒకేసారి నోటిఫై చేయడంతో నిర్వహణపరంగా ఇబ్బందులను సృష్టిస్తున్నదని ఈ సమావేశంలో పలువురు అభిప్రాయం వ్యక్తంచేశారు. రెండు ఎన్నికలకు మధ్య కనీసం 15 రోజుల విరామం ఉండాలని, ఒక ఎన్నిక పూర్తయ్యాక మరొక ఎన్నిక నిర్వహించాలని తీర్మానించారు. సమావేశంలో సంఘం ప్రధాన కార్యదర్శి ఎం మోహన్, అసోసియేట్ అధ్యక్షుడు గంగుల సంతోష్‌కుమార్, రాష్ట్ర నాయకులు చిరంజీవి, శ్రీనివాస్, రామకృష్ణ, యాదగిరి, రాజేశ్వర్, శ్రీశివన్రెడ్డి, రామకృష్ణ, కథలప్ప, విజయ్, వేణుగోపాల్‌రావు పాల్గొన్నారు.