హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూన్ 15 (నమస్తే తెలంగాణ): ధరణి పోర్టల్ వచ్చిన తర్వాతే భూ రికార్డులపై చైతన్యం పెరిగిందని ప్రముఖ న్యాయవాది పెండం వరప్రసాద్ అన్నారు. గతంలో పట్వారీలు, పైరవీకారులు రాసిందే రాతగా, గీసిందే గీతగా ఉండేదని, ఆ వ్యవస్థను ధరణి సమూలంగా మార్చేసిందని తెలిపారు. ధరణిని బంగాళాఖాతంలో కలుపుతామంటూ కాంగ్రెస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై వరప్రసాద్ స్పందించారు.
గతంలో సామాన్య రైతు తన వ్యవసాయ భూమికి సంబంధించిన పహాణీ నకలు కావాలంటే ఎక్కే గడప, దిగే గడప.. అన్నట్టుగా ఉండేది. రెండుమూడు నెలలు ఎమ్మార్వో ఆఫీసు చుట్టూ తిరిగేవాళ్లు. ఏదో ఒక నాయకుడుగానీ, పైరవీకారుడిని పట్టుకుంటే తప్ప రికార్డులు లభించేవి కావు. ముఖ్యంగా 1బీ కావాలంటే అసాధ్యంగా ఉండేది. కానీ ఇప్పుడు అంతా ఆన్లైన్. మేం ఇచ్చిన చెక్‌లిస్టు తెచ్చేందుకు మా క్లయింట్‌కు అరగంట, గంట సమయం చాలు.
భూముల కొలతలు, సర్వే అంటే సాధారణ రైతు కాదు కదా.. విద్యావంతులు, రాజకీయ నాయకులకు సైతం పెద్ద సవాల్.ముఖ్యంగా న్యాయపరమైన అంశాలతోపాటు రియల్ వ్యాపారాలకు సంబంధించి కొలతలు కావా ల్సి వచ్చినపుడు ముందుగా ఎమ్మార్వో ఆఫీసులో దరఖాస్తు చేసుకొంటే.. కేవలం టీపన్ల (కొలతలకు వినియోగించేవి) కోసం నాలుగైదు నెలలు పట్టేది. అవి ఎమ్మార్వో ఆఫీసులో ఉండవు. జిల్లా కేం ద్రంలోని ఏడీ కార్యాలయంలో ఉన్న వా టిని తెప్పించేందుకు పెద్ద ఎత్తున పైరవీ చే యాల్సి వచ్చేది. ఇందుకోసం కింది నుంచి పైదాకా చేతులు తడిపితేగానీ పని అయ్యేది కాదు. కానీ ఇప్పుడు ధరణిలోనే సమస్త సమాచారం ఉన్నది.
గతంలో ఒక భూమికి సంబంధించి పాసు పుస్తకాలు సృష్టించడం చాలా సులువైన పని. ఎమ్మార్వో చేతిలో ఉంటే చాలు… ఏ సర్వే నంబర్‌లోనైనా పాసు పుస్తకాలు పొందవచ్చు. అందరు అధికారులు అలా కాదుగానీ… కొందరు అధికారుల వల్ల దొంగ పాసు పుస్తకాల సృష్టి జరిగి… అమాయక రైతులు అనేక మంది కోర్టుల చుట్టూ ఏండ్ల తరబడి తిరగడం మేం చూశాం. అనేక కేసులు వాదించాం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సంబంధిత రైతు వేలిముద్ర పెడితేగానీ భూమి రిజిస్ట్రేషన్ జరగదు. దీంతో వందకు వంద శాతం దొంగ రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి.
భూమి కేసులకు సంబంధించి మేం కోర్టుల్లో సమర్పించే డాక్యుమెంట్లలో ఆధారాలు సమర్పించేందుకు నానా తంటాలు పడేవాళ్లం. రెవెన్యూ అధికారుల నుంచి ధ్రువీకరణ పత్రాలు, పహాణీ నకలు ఇలా అన్ని తెచ్చినప్పటికీ న్యాయమూర్తులు అంత సులువుగా నమ్మేవాళ్లు కాదు. భూ రికార్డుల నిర్వహణలో ఎలాంటి ఆధునిక, శాస్త్రీయత లేకపోవడంతో న్యాయమూర్తులు కూడా ప్రతి డాక్యుమెంట్‌ను అనుమానించి, క్షుణ్ణంగా పరిశీలించేవాళ్లు. కానీ ఇప్పుడు ధరణి వచ్చిన తర్వాత చాలా సులువైంది. మేం ధరణి ద్వారానే డౌన్లోడ్ చేసి వాటిని కోర్టుకు సమర్పిస్తున్నాం.
న్యాయపరమైన విషయాల్లోనే కాదు… ఇతర అంశాల్లోనూ పాదర్శకతతో పాటు పరిగెడుతున్న కాలానికి అనుగుణంగా భూ రికార్డుల అంశం ఉండాలంటే ధరణి తప్పనిసరి. లేకపోతే గతంలో మాదిరిగా మాన్యువల్ ఉం టే ఈ వేగానికి తట్టుకోలేం. గతంలో కాంగ్రెస్ పాలనలో అంతా పైరవీలు, లంచాలు. అసలు సామాన్య రైతుకు ఖాస్రా పహాణీ అంటేనే అదేదో పెద్దవాళ్ల వ్యవహారం అన్నట్టుగా ఉండేది. ధరణి తీసేస్తే మళ్లీ పాత రోజుల్లోకి వెళతాం.
వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా బదలాయింపు (నాలా-నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ అసెస్మెంట్) కోసం ఐదారు నెలలు తిరగాల్సి వచ్చేది. ముందు ఎమ్మార్వో ఆఫీసులో దరఖాస్తు చేసుకుంటే.. పట్వారీ, గిర్దావర్, ఎమ్మార్వో.. వీరందరి పరిశీలన అయ్యేసరికి నెలలు గడిచేది. తర్వాత ఆర్డీవో ప్రక్రియ ముగిసేవరకు మరో రెండు నెలలు పట్టేది. ఇలా కనీసం ఒక నాలా కోసం ఐదారు నెలలు తిరగక తప్పేది కాదు. కానీ ఇప్పుడు కేవలం 20 నిమిషాల్లో ఆ పక్రియ పూర్తవుతున్నది. దీని వల్ల ఎంతో సమయం ఆదా అవుతున్నది. ఎవరికీ చిల్లిగవ్వ లంచం ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు.