సుల్తాన్ బజార్, జూన్ 28 : పీడియాట్రిక్ ఆరోగ్య సంరక్షణలో ఉస్మానియా దవాఖాన ఓ మైలురాయిని దాటింది. దవాఖాన యూరాలజీ విభాగం వైద్యులు ఆరుగురు చిన్నారులకు శస్త్రచికిత్సలు చేసి మూత్రపిండాల్లోని రాళ్లను విజయవంతంగా తొలగించి వైద్యశాల కీర్తిని మరింత పెంచారు. శస్త్రచికిత్సలు జరిగిన వారిలో 6 నెలల శిశువు ఉండడం విశేషం.
ఈ సందర్భంగా దవాఖాన యూరాలజీ విభాగం వైద్యుడు డాక్టర్ ఆనంద్ మాట్లాడుతూ.. ఇప్పటివరకు మొత్తం 109 పీడియాట్రిక్ స్టోన్ సర్జరీలు నిర్వహించామని, ప్రస్తుత సర్జరీల్లో అధునాతన పద్ధతులైన పర్క్యూటేనియస్ నెఫ్రోలిథోటమీ(పీసీఎన్ఎల్), రెట్రోగ్రేడ్ ఇంట్రారెనల్ సర్జరీ(ఆర్ఐఆర్ఎస్), (యూరెటెరోస్కోపిక్ లిథోట్రిప్సీ(యుఆర్ఎస్ఎల్)వాడినట్టు వెల్లడించారు.
సంవత్సరంలోపు శిశువుల్లో ఇలాంటి చికిత్సలు విజయవంతంగా చేయడం గర్వంగా ఉందని తెలిపారు. పీసీఎన్ఎల్ పద్ధతిలో 6 నెలల శిశువుకు శస్తచ్రికిత్స చేయడంతోపాటు 13 నెలల చిన్నారిలో ఆర్ఐఆర్ఎస్ లేజర్ ఆధారిత మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీని విజయవంతంగా నిర్వహించినట్టు చెప్పారు. చిన్నారులను వయోక్రమంగా విభజించి చికిత్సలు చేసినట్టు వెల్లడించారు. ఈ చికిత్సలతో ప్రజల్లో మరింత విశ్వాసం చూరగొననున్నట్టు పేర్కొన్నారు.