హైదరాబాద్, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ): ‘బిడ్డా రేవంత్‌రెడ్డీ.. నోరు అదుపులో పెట్టుకో.. నీ చిల్లర కూతలు ఆపు..లేదంటే ప్రజలే తరిమికొడుతరు’ అని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి హెచ్చరించారు. తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి, దేశంలోనే అగ్రభాగాన నిలిపిన కేసీఆర్‌ను తెలంగాణలో జీవించే హకులేదనడం రేవంత్‌రెడ్డి చిల్లరతనానికి నిదర్శనమని భగ్గుమన్నారు. రేవంత్‌రెడ్డి 100 మంది రౌడీషీటర్లతో సమానమని శుక్రవారం ఓ ప్రకటనలో విమర్శించారు. ‘రేవంత్‌రెడ్డి పెద్ద జోకర్.. తెలంగాణ ద్రోహి.. ఓటుకునోటు దొంగ.. 420’ అని దుయ్యబట్టారు. ‘పోరాడి తెలంగాణ రాష్ట్రం సాధించిన యోధుడు కేసీఆర్.. హైదరాబాద్‌ను ప్రపంచంలోనే ఐటీలో మేటిగా నిలిపిన నేత కేటీఆర్.. సాగునీటి రంగంలో విప్లవాన్ని తెచ్చిన నేత హరీశ్‌రావు.. వారికి తెలంగాణలో జీవించే హకులేదనటం రేవంత్ వెకిలి మనస్తత్వానికి నిదర్శనం’ అని మండిపడ్డారు.‘రేవంత్.. ఒక కార్యక్రమమైనా విజయవంతంగా నిర్వహించినవా? కేసీఆర్‌ను తిట్టుకుంటూ పబ్బం గడపడం తప్ప నువ్వు చేస్తున్నదేమిటి’ అని నిలదీశారు.
ప్రేలాపనలు మానుకో : పల్లె రవి
ఆరు దశాబ్దాల తెలంగాణ ఆకాంక్షను తన రాజకీయ చతురతతో ఒడ్డుకు చేర్చి, తన పాలనలో రాష్ర్టాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలబెట్టిన కేసీఆర్ గురించి పిచ్చి ప్రేలాపనలు మానుకుంటే మంచిదని సీఎం రేవంత్‌రెడ్డికి రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్‌గౌడ్ హితవుపలికారు. రేవంత్ చేసిన వ్యాఖ్యలు ఆయన చిల్లరమల్లర రాజకీయాలకు అద్దం పడుతున్నాయని మండిపడ్డారు. అన్ని వర్గాల ప్రజలను నయవంచన చేసిన కాంగ్రెస్ నేతలను తెలంగాణ ప్రజలు తరిమికొట్టే రోజులు ఎంతో దూరంలో లేవని శుక్రవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. బీసీ కులగణన దశాబ్దాల డిమాండ్‌ను కాంగ్రెస్ కుటిల రాజకీయాలకు బలి చేస్తామంటే ఊరుకోబోమని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర జనాభా 3 కోట్ల 70 లక్షలే అని దబాయించడానికి సిగ్గనిపిస్తలేదా? అని నిలదీశారు.
కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు సహించబోం ; బీఆర్ఎస్ నేత మేడె రాజీవ్‌సాగర్
హైదరాబాద్, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ): పోరాడి రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్‌కు తెలంగాణలో జీవించే హక్కులేదని సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను సహించబోమని బీఆర్ఎస్ నేత మేడె రాజీవ్‌సాగర్ హెచ్చరించారు. హామీలను తుంగలో తొక్కిన సీఎంను తరిమికొట్టేందుకు ఆయన నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారని తేల్చిచెప్పారు. రేవంత్‌రెడ్డి పాలన తుగ్లక్ పాలనను తలపిస్తున్నదని శుక్రవారం ఒక ప్రకటనలో ఎద్దేవా చేశారు.