హైదరాబాద్, మే 3(నమస్తేతెలంగాణ): పత్తి కొనుగోళ్ల పేరిట కాంగ్రెస్ నేతలు భారీ కుంభకోణానికి తెరలేపారని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. 60 నకిలీ టీఆర్ (టెంపరరీ రిజిస్ట్రేషన్) నంబర్లతో ట్రేడర్లు, బ్రోకర్ల ముసుగులో దోపిడీకి పాల్పడ్డారని చెప్పారు. రైతుల ఖాతాల్లోకి చేరాల్సిన రూ. 3వేల కోట్లు కాంగ్రెస్ నేతల ముసుగులోని నకిలీ ట్రేడర్లు, బ్రోకర్ల ఖాతాల్లోకి వెళ్లాయని తెలిపారు. నిరుడు దీపావళి నాడు హైదరాబాద్‌లోని ఓ 5స్టార్ హోటల్లో సీసీఐ అధికారులు, ప్రముఖ ట్రేడర్స్ మధ్య జరిగిన రహస్య సమావేశంలోనే ఈ కుంభకోణానికి బీజం పడిందని స్పష్టంచేశారు.
సీసీ కెమెరాలను పరిశీలిస్తే దొంగలు దొరికిపోతారని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ స్కాం వెనుక ప్రభుత్వ పెద్దలు, సీసీఐ ఉన్నతాధికారులు ఉన్నారని చెప్పారు. ఈ వ్యవహారంలో ఏడుగురు మార్కెట్ కార్యదర్శులపై వేటు పడటం, మరో 130 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేయడమే అవకతవకలు జరిగాయనేందుకు నిదర్శనమని పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆరోపించారు.
రాష్ట్రవ్యాప్తంగా 2024-25లో 25 లక్షల మంది రైతులు 49 లక్షల బేళ్ల పత్తి పండించారని వ్యవసాయశాఖ ప్రకటించిందని పెద్ది చెప్పారు. ఇందులో 41 లక్షల బేళ్ల (80 శాతం) పత్తిని కేవలం 6.30 లక్షల మంది (20 శాతం) రైతుల నుంచి, 8 లక్షల బేళ్లను ట్రేడర్ల ద్వారా సేకరించామని సీసీఐ వెల్లడించిందని, కనీస మద్దతు ధర రూ.7521 చెల్లించి కొనుగోలు చేసినట్టు ఆన్లైన్లో వివరాలు పెట్టిందని తెలిపారు.
‘మరి 80 శాతం పత్తిని 20 శాతం మంది రైతుల నుంచి కొంటే మిగిలిన పత్తిని ఎవరి వద్ద నుంచి కొనుగోలు చేసినట్టు? మద్దతు ధర ఎవరికి చెల్లించినట్టు? సుమారు 18 లక్షల మంది రైతులు పత్తిని ఎవరికి అమ్ముకున్నట్టు?’ అంటూ సీసీఐ అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు. కాంగ్రెస్ నాయకులు బ్రోకర్లు, ట్రేడర్ల అవతారమెత్తి సిండికేట్‌గా మారి రైతుల నుంచి రూ.5వేల నుంచి 5,500కు కొని సీసీఐకి క్వింటాల్‌కు రూ.7,521కు అమ్మినట్టు ఆరోపించారు.
ఏటా అక్టోబర్‌లో ప్రారంభించాల్సిన పత్తి కొనుగోళ్లను ఈ సీజన్లో నవంబర్ మొదటి వారంలో చేపట్టారని సుదర్శన్‌రెడ్డి వెల్లడించారు. ఈ సివిల్ సప్లయ్ టెండర్ల స్కాంలో సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హస్తం ఉన్నదని ఆరోపించారు. అందుకే కౌంటర్ దాఖలు చేసేందుకు ప్రభుత్వం వెనుకాడుతున్నదని చెప్పారు.