కాంగ్రెస్ ప్రభుత్వంలో వ్యవసాయం దండగనే పరిస్థితి మళ్లీ వచ్చింది. రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నారు. గోదావరిలో నీళ్లున్నా భేషజాలకు పోయి భారీ ప్రాజెక్టును నిర్వీర్యం చేస్తున్నారు.
-సిరికొండ మధుసూదనాచారి
హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ సర్కారు రైతాంగం పాలిట శాపంగా మారిందని, కాళేశ్వరం ప్రాజెక్టుపై నీలాపనిందలు వేస్తూ రైతులకు సాగునీరు అందించడం లేదని శాసనమండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డితో కలిసి ఆయనమాట్లాడారు. గోదావరిలో నీళ్లు ఉన్నప్పటికీ కావాలనే కాళేశ్వరం ప్రాజెక్టును పడావుపెట్టి రైతులను ఎండబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశా రు. 2014కు పూర్వం ఉన్న పరిస్థితులను కాం గ్రెస్ పునరావృతం చేస్తున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. బొట్టుబొట్టును ఒడిసిపట్టి రాష్ట్రంలోని ప్రతి అంగుళానికి సాగునీరు అందించి, తెలంగాణ వ్యవసాయాన్ని దేశానికి ఆదర్శప్రాయంగా తీర్చిదిద్ది సుపరిపాలన అందించిన నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. ఎస్సారెస్పీ ఫేజ్-1 లో 9.65 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉండగా ప్రభుత్వం 2.34 లక్షల ఎకరాలకు మాత్రమే అందించిందని మండిపడ్డారు. అంటే దాదాపు 7.3 లక్షల ఎకరాల పంటలను ఎండబెట్టే పాపానికి ఈ ప్రభుత్వం ఒడిగట్టిందని విమర్శించారు. ఇక ఫేజ్-2 ఊసేలేదని చెప్పారు. లక్షలాది ఎకరాల్లో నాట్లు పూర్తికావస్తున్న తరుణంలో ప్రభుత్వం ఇప్పుడు నీటి లెక్కలు ప్రకటించడం ఏంటని ఆగ్రహం వ్యక్తంచేశారు.
తాను ఎమ్మెల్యేగా ఉన్న 1994లో ఒక గ్రామంలో యాసిన్సాగర్ పేరుతో ఒక చెరువు ఉండేదని, దానికి 50 ఏండ్ల క్రితం గండిపడిందని మధుసూదనాచారి గుర్తుచేసుకున్నారు. దానికి మరమ్మతు కోసం ప్రతిపాదనలు పంపితే అప్పట్లో ఓ పెద్ద అధికారి యాసిన్సాగర్కు మరమ్మతు చేస్తే ధవళేశ్వరంపై ఏమైనా ప్రభావం పడుతుందా? అని అడగడంతో షాక్‌కు గురయ్యానని పేర్కొన్నారు. ఎక్కడ యాసిన్సాగర్, ఎక్కడ ధవళేశ్వరం అని ఆశ్చర్యపోయానని పేర్కొన్నారు.
గోదావరి నీటిని తక్కువ ఆయకట్టుకు అందిస్తామని కాంగ్రెస్ చెప్పడం రైతులను మోసం చేయడమేనని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి మండిపడ్డారు. ఎస్సారెస్పీ కింద 6.5 లక్షల ఎకరాలకు తగ్గకుండా నీరు ఇస్తామని గత నెలలో చెప్పి, ఇప్పుడు 2.3 లక్షల ఎకరాలకు మాత్రమే నీళ్లు ఇస్తామని చెప్పడం దారుణమని అన్నారు. కేసీఆర్ నిర్మించిన ప్రాజెక్టుల మోటర్లు ఆన్ చేయకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నారని దుయ్యబట్టారు. రైతులకు సాగునీరు ఇవ్వకుండా ఓట్ల కోసం వారి వద్దకు ఎలా వెళ్తారని నిలదీశారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నియోజకవర్గం హుజూర్‌నగర్‌కు కూడా ఇప్పుడు నీరిచ్చే పరిస్థితి లేదని పేర్కొన్నారు.
రాష్ట్రంలో పరిస్థితులు ఇలాగే ఉంటే రైతులు రోడ్డెక్కుతారని, కాంగ్రెస్ నాయకులను అడ్డుకునే పరిస్థితి వస్తుందని పెద్ది సుదర్శన్‌రెడ్డి హెచ్చరించారు. మేడిగడ్డ వద్ద 1.45 లక్షల క్యూసెక్కుల నీరు కిందకు పోతున్నదని తెలిపారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులను బద్నాం చేయాలన్న ఉద్దేశంతోనే కాళేళ్వరం ప్రాజెక్టు మోటర్లు ఆన్ చేయడం లేదని ఆరోపించారు. వారిమీద ఉన్న కోపంతో రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. జస్టిస్ ఘోష్ కమిషన్‌ది కోర్టు తీర్పు కాదని, అదొక రిపోర్టు మాత్రమేనని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుపై ఉన్న అన్ని కాంపోనెంట్లను బీఆర్ఎస్ ఆధ్వర్వంలో సందర్శిస్తామని తెలిపారు. కార్యక్రమంలో వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ పాల్గొన్నారు.
బొట్టుబొట్టును ఒడిసిపట్టి రాష్ట్రంలోని ప్రతి అంగుళానికి సాగునీరు అందించి, తెలంగాణ వ్యవసాయాన్ని దేశానికి ఆదర్శప్రాయంగా తీర్చిదిద్ది సుపరిపాలన అందించిన నాయకుడు కేసీఆర్.
కండ్ల ముందే కృష్ణా, గోదావరి పరుగులు పెడుతున్నా రాష్ట్రంలోని బీడు భూములకు నీళ్లు అందని దయనీయ పరిస్థితిని గమనించే కేసీఆర్ చెరువులను పునరుద్ధరించారని మధుసూదనాచారి పేర్కొన్నారు. ఎండాకాలంలోనూ చెరువులు నిండుగా ఉండేవని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో వ్యవసాయం దండగనే పరిస్థితి మళ్లీ వచ్చిందని ఆవేదన వ్యక్తంచేశారు. రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. రైతు విత్తనం నాటినప్పటి నుంచి ధాన్యం అమ్ముకునేంత వరకు కేసీఆర్ వారికి వెన్నుదన్నుగా నిలిచేవారని పేర్కొన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో సాగునీటికి గతిలేదని మండిపడ్డారు. గోదావరిలో నీళ్లున్నా భేషజాలకు పోయి భారీ ప్రాజెక్టును నిర్వీర్యం చేస్తున్నారని సిరికొండ మండిపడ్డారు.