హైదరాబాద్, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ ) : ఇచ్చిన ఏ ఒక్కహామీనీ అమలుచేయకుండా రైతు డిక్లరేషన్ ఇచ్చిన చోటుకు వస్తే ప్రజలు తిరగబడతారని భయపడే కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ వరంగల్ పర్యటనను రద్దు చేసుకున్నారని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి విమర్శించారు. వరంగల్‌లో హెలికాప్టర్ దిగాల్సిన చోటే గతంలో రాహుల్‌గాంధీ రైతు డిక్లరేషన్ ప్రకటించారని, అందులో ఏ ఒక హామీని అమలు చేయకపోవడంతో రైతులు, ప్రజలు నిలదీస్తాయనే భయంతోనే వరంగల్‌కు ముఖం చాటేశారని మండిపడ్డారు. చెప్పి వస్తే తిరుగుబాటు వస్తుందని రాహుల్ దొంగచాటుగా వద్దామనుకున్నారని, అది కూడా చివరికి రద్దు చేసుకున్నారని దుయ్యబట్టారు. తెలంగాణభవన్‌లో మంగళవారం మాజీ ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యే శంకర్‌నాయక్, రాష్ట్ర కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు వాసుదేవరెడ్డి, కిషన్‌రావుతో కలిసి మీడియాతో మాట్లాడారు.
‘రైతు రుణమాఫీ పూర్తి కాలేదు. పంటలకు బోనస్ బోగస్ అయ్యింది. రైతు భరోసా డబ్బులు రైతుల అకౌంట్లలో పడలేదు. రేవంత్ వైఫల్యాలపై రహస్యంగా సమావేశం నిర్వహించేందుకు రాహుల్ వస్తున్నారు. ఈ మీటింగ్‌కు రేవంత్‌ను కూడా పిలవలేదని ప్రచారం జరిగింది. రాష్ట్రంలో అవినీతి పాలన జరుగుతున్నదని రాహుల్‌కు కూడా తెలుసు. రాహుల్ పర్యటన రద్దుకు రేవంత్ పాలనా వైఫల్యమే కారణం. ప్రజల్లో తిరుగుబాటు ధోరణిని గ్రహించే రాహుల్ తన పర్యటనను రద్దు చేసుకున్నారు’ అని సుదర్శన్‌రెడ్డి ధ్వజమెత్తారు. రేవంత్‌రెడ్డి అనేకసార్లు ఢిల్లీ వెళ్లినా రాహుల్ ఆయన ముఖం కూడా చూడలేదని, రేవంత్ కాంగ్రెస్ అధిష్ఠానం విశ్వాసాన్ని కోల్పోయారని విమర్శించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరుగుబాటు బాటపట్టారని, మీటింగ్‌లు పెట్టుకుంటున్నారని, అందుకే రాహుల్ పర్యటన రద్దు చేసుకున్నారని చెప్పారు. దేశమంతా కాంగ్రెస్ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని, అందుకే ఢిల్లీలో కాంగ్రెస్‌కు వరసగా మూడుసార్లు గాడిద గుడ్డే దకిందని ఎద్దేవాచేశారు.
కోస్గిలో సోమవారం నిర్వహించిన కేటీఆర్ రైతు దీక్ష సభ విజయవంతమైందని మాజీ ఎంపీ మాలోత్ కవిత చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి నియోజకవర్గంలో ప్రజల తిరుగుబాటు తీవ్రస్థాయిలో ఉన్నదని పేర్కొన్నారు. రేవంత్‌పై రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను గమనించే రాహుల్ పర్యటనను రద్దు చేసుకున్నారని తెలిపారు. కేవలం 14 నెలల పాలనలో ఇంత ప్రజావ్యతిరేకతను మూటగట్టుకున్నది రేవంత్ ప్రభుత్వం ఒక్కటేనని దెప్పిపొడిచారు. 420 హామీలిచ్చి అమలు చేయని 420 పార్టీగా కాంగ్రెస్ నిలిచిందని మండిపడ్డారు.