పెద్దపల్లి, ఏప్రిల్ 11(నమస్తే తెలంగాణ)/పెద్దపల్లి: భూమి రిజిస్ట్రేషన్ కోసం లంచం డిమాండ్ చేసి ఓ సబ్ రిజిస్ట్రార్.. తన కార్యాలయ అటెండర్ ద్వారా రూ.60 వేలు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ కే భద్రయ్య తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దపల్లి మండలం రాఘవపూర్ సర్వే నంబర్ 1109/1లో 1724 చదరపు గజాల భూమిని రిజిస్ట్రేషన్ చేయాలని పెద్దపల్లి పట్టణానికి చెందిన పూదరి శ్రీనివాస్ సబ్ రిజిస్ట్రార్ దేవనగిరి నిర్మలను ఆశ్రయించాడు.
ఆ భూమి కోర్టు కేసులో ఉన్నదని రిజిస్ట్రేషన్‌ను దాటవేశారు. శ్రీనివాస్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వు కాపీలను చూపించాడు. అయినా.. ఫైల్‌ను వారం రోజులు పెండింగ్‌లో పెట్టిన సబ్ రిజిస్ట్రార్.. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ చేసి నంబర్ ఇవ్వలేదు. అదే భూమిని ఆరుగురికి పార్టీషన్ చేయాలని నిర్మలను కోరగా.. డాక్యుమెంట్‌కు రూ.15 వేల చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు. శ్రీనివాస్ నాలుగు డాక్యుమెంట్లకు రూ.60 వేలు ఇస్తానని ఒప్పుకున్నాడు. లంచం ఇవ్వడం ఇష్టం లేని శ్రీనివాస్ ఏసీబీ అధికారులను సంప్రదించాడు. మంగళవారం పూదరి శ్రీనివాస్ నుంచి అటెండర్ సుద్దాల శ్రీనివాస్ డబ్బులు తీసుకుంటుండగా పట్టుకున్నట్టు ఏసీబీ డీఎస్పీ కే భద్రయ్య వెల్లడించారు. పెద్దపల్లి సబ్ రిజిస్ట్రార్ నిర్మల, అటెండర్ సుద్దాల శ్రీనివాస్‌పై కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు.. వారిని కరీంనగర్‌లోని ఎస్పీఈ, ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. పెద్దపల్లిలో పని చేసిన ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లు వరుసగా ఏసీబీకి చిక్కడం గమనార్హం.