మంథని, జూన్ 20: మంథని నియోజకవర్గంలోని పోలీస్స్టేషన్లు ప్రజలకు రక్షణ కల్పించే రక్షకభట కేంద్రాలా? లేక కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలా? అని పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ ప్రశ్నించారు. ఆ పార్టీ నాయకులు.. తమ కనుసన్నల్లో పనిచేసే పోలీసు అధికారులను ట్రాన్స్ఫర్ల మీద మంథని నియోజకవర్గానికి తీసుకొస్తున్నారని ఆరోపించారు. గురువారం పెద్దపల్లి జిల్లా మంథనిలోని రాజగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ప్రజలను రక్షించాల్సిన బాధ్యతలో ఉన్న కాళేశ్వరం ఎస్సై భవానిసేన్ అదే స్టేషన్లో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్‌పై అఘాయిత్యానికి పాల్పడటం సహించరాని నేరమని చెప్పారు. భవానిసేన్ ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న సమయంలోనూ ఓ మహిళపై లైంగికదాడికి ప్రయత్నించగా.. అధికారులు కేసు నమోదు చేశారని పేర్కొన్నారు.
నాడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ ఎస్సైకి ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదని, కానీ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాంత ఎమ్మెల్యే, మంత్రి సోదరుడు ఎస్సై నుంచి రూ.20 లక్షలు తీసుకొని కాళేశ్వరంలో పోస్టింగ్ ఇప్పించారని ఆరోపించారు. స్టేషన్‌కు వచ్చేవారికి సదరు ఎస్సై ఓ మంత్రి, ఆయన సోదరుడి పేరును చెప్తూ బెదిరింపులకు పాల్పడే వారని విమర్శించారు.
మంథని నియోజకవర్గంలోని పోలీస్స్టేషన్లు కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలుగా మారుతున్నాయని ఆరోపించారు. అందుకు ఇటీవల మహదేవపూర్ పోలీస్‌స్టేషన్‌లో ఆ మండల జడ్పీటీసీ భర్త నృత్యాలు చేయడమే నిదర్శమని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ ఆరు నెలల్లో చేసిన అభివృద్ధి ఏమీ లేదని, అవినీతి మాత్రం ఆకాశాన్ని తాకిందని ఎద్దేవా చేశారు.
పోలీస్స్టేషన్లను అడ్డంపెట్టుకుని బియ్యం, మట్టి, ఇసుక వంటి అక్రమ దందాలు చేస్తున్నారని, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన అధికారులతోనే తనను చంపాలని చూస్తున్నారని ఆరోపించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా నిర్విరామంగా పోరాటం చేస్తామని, మంథని నియోజకవర్గంలో రాజకీయ చైతన్యం వచ్చే వరకు తన పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు ఎగోలపు శంకర్‌గౌడ్, పూదరి సత్యనారాయణగౌడ్, బత్తుల సత్యనారాయణ, గర్రెపల్లి సత్యనారాయణ, కాయితీ సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.