హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ): మంత్రి శ్రీధర్‌బాబు ఇసుక, మట్టి మాఫియాను ప్రోత్సహిస్తున్నారని పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు ఆరోపించారు. యథేచ్ఛగా ఇసుక తరలిపోతున్నా అధికారులు చోద్యం చూస్తున్నారని విమర్శించారు. మైనింగ్ ప్రమాణాలు పాటించకుండా మట్టిని తరలిస్తున్నారని, ఒక లారీకి పర్మిషన్ ఉంటే వంద లారీల్లో మట్టి, ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని తెలిపారు. సోమవారం ఆయన తెలంగాణ భవన్లో కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాసుదేవరెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వానికి రావాల్సిన డబ్బు శ్రీధర్‌బాబు కుటుంబసభ్యుల జేబుల్లోకి వెళ్తున్నదని ఆరోపించారు. ఓటుకు రూ.2 వేలు ఇచ్చి శ్రీధర్‌బాబు ఎమ్మెల్యేగా గెలిచారని, ఎన్నికలప్పుడు ఇసుక మాఫియా గురించి నీతులు చెప్పిన ఆయన.. ఇప్పుడు అదే దందాకు తెరలేపారని విమర్శించారు. నియోజకవర్గ స్థాయిలో అధికారులకు ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకోవటం లేదని, రాష్ట్ర స్థాయి అధికారులైనా అరికట్టాలని విజ్ఞప్తి చేశారు.